ఆయనది తుగ్లక్ పాలన.. సంస్కారంలేని మాటలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన హోదాను మరిచిపోయి..సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. తుగ్లక్ పాలనలా, పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిపాలన ఉందని ప్రజలు అనుకుంటున్నరని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.
తెలంగాణ ప్రజాధనాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్‌కు నిధులు ఉన్నాయి కానీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవా? అని ప్రశ్నించారు. పంటలు నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే.. వారు సంబురాలు చేసుకుంటున్నారని కేసీఆర్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే.. మరొక జిల్లాలలో కేవలం నాలుగు లక్షల జనాభా మాత్రమే ఉండటం శాస్త్రీయతనా? ప్రశ్నించారు. మరో నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంది కాబట్టే.. తెలంగాణ ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆరే ఫామ్‌హౌజ్‌లో పడుకొని సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.