టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలనలో డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కోటి 90లక్షల మంది మహిళలు ఉండగా.. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు మహిళల ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పావలా వడ్డీ, తర్వాత వడ్డీలేని బుణాలు ఇచ్చిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్! మహిళలకు లోన్లు ఇచ్చి, బిల్డింగులు కట్టించి మీటింగుల్లో పెట్టించారని, కానీ కేసీఆర్ దరిద్రపు పాలనలో లోన్లు, బిల్డింగులు లేవని అసలు మహిళలను పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6లక్షల మహిళా సంఘాలకు 100 రోజుల్లో రూ. లక్ష గ్రాంట్ ఇస్తామన్నారు. తెల్లకార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా ఇస్తామని, బియ్యంతో పాటు అమ్మహస్తం క్రింద ఇచ్చిన తొమ్మిది రకాల సరుకులు మళ్లీ ఇస్తామని చెప్పారు. దళితులకు, గిరిజనులకు రేషన్ ద్వారా బియ్యం, తొమ్మిది సరుకులు.. 200 యూనిట్లలోపు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘1000రూపాయల పెన్షన్ 2వేలకు 1500 పెన్షన్ 3వేలకు పెంచుతాం.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్దాప్య పెన్షన్లు దంపతులిద్దరికీ, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇస్తాం. స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం కట్టుకునేందుకు ఐదులక్షలు ఇస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు రాని మన పిల్లలకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంద’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment