
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి (99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అమెరికాలోని హ్యుస్టన్‌లో అనసూయాదేవి కన్నుమూశారు. డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. 1920 మే 12న కాకినాడలో ఆమె జన్మించారు. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది.
స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఆమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె దాదాపు ఏడు పుస్తకాలను జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 'కళా ప్రపూర్ణ' అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. పారిస్‌లోనూ అనసూయాదేవికి క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం.
Comments
Please login to add a commentAdd a comment