Folk music
-
అనసూయాదేవి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి (99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అమెరికాలోని హ్యుస్టన్‌లో అనసూయాదేవి కన్నుమూశారు. డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. 1920 మే 12న కాకినాడలో ఆమె జన్మించారు. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఆమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె దాదాపు ఏడు పుస్తకాలను జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 'కళా ప్రపూర్ణ' అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. పారిస్‌లోనూ అనసూయాదేవికి క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. -
ఆకాశవాణి రేలారే..!
హరన్సింఘా...దట్టమైన అడవి, కొండ, గుట్టలతో కూడిన జార్ణండ్ గ్రామం. ఒకప్పుడు నక్సలైట్లకు పెట్టనికోటగా నిలిచిన ప్రదేశం. ఈ ప్రాంతంలోనే వందల ఏళ్లుగా నివసిస్తున్న సంతాల్ గిరిజనతెగకు చెందిన వారిప్పుడు కొందరు ప్రత్యేక అతిథులకు సాదర స్వాగతం పలికారు. వారుమరెవరో కాదు.. గిరిజన భాష, జానపదసంగీతం మిణుకు మిణుకు మంటూ ఆరిపోకముందే వాటిని రికార్డ్ చేసేందుకు వచ్చిన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)కు చెందిన నిపుణులు. జానపద సంగీతం, సాహిత్యం కొడిగట్టకుండా, క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదమున్న సంతాలీ సంగీతాన్ని నిక్షిప్తం చేసేందుకు వారంతా కూడా భాగల్పూర్, బీహార్ల మీదుగా ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు... కశ్మీర్ మొదలుకుని ఈశాన్యరాష్ట్రాలు... అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల వరకు నిత్యం ఘర్షణలు తలెత్తుతున్న కల్లోల ప్రాంతాల్లోని గిరిజనతెగల జానపద సంగీతాన్ని రికార్డ్ చేసే (ఆడియో, వీడియో) గురుతర బాధ్యతను ఏఐఆర్ స్వీకరించింది. 2014లో ఏఐఆర్ దేశవ్యాప్తంగా ఉన్న జానపద, గిరిజన సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. మొత్తం ఆరువేల వరకున్న గిరిజన కులాలు, తెగలు 16,500 భాషలు మాట్లాడుతున్నాయి. వాటిలోని 9 లక్షల పాటలను నిక్షిప్తం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 20 వేల గీతాలు రికార్ట్చేసింది. దేశంలోని 214 ఏఐఆర్ కేంద్రాల్లోని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ల సొంత చోరవతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కోసం ప్రత్యేక బడ్జెట్ లేదా వనరులేమి కేటాయించలేదు. ఈ అఖిల భారతస్థాయి ప్రాజెక్టును ఢిల్లీలోని త్రిసభ్యబృందం పర్యవేక్షిస్తోంది. ఏఐఆర్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా రిటైరైన సోమ్ దత్ శర్మ 1980లలో మొదటి పోస్టింగ్ రాంఛీలో పనిచేస్తునపుడు వివిధ గిరిజన తెగల భాషలు, సంగీతాన్ని రికార్డ్ చేశారు. అప్పుడే ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఇప్పుడు ఆయనే ‘ఆకాశవాణి లోక్ సంపద సంరక్షణ్ మహాపరియోజన’ పేరిట ఈ ప్రాజెక్టు సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుత ఏఐఆర్ డైరెక్టర్జనరల్ శశి శేఖర్ వెంపటి తీసుకున్న చోరవతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. సేకరణ ఎలా...? 1) కుటుంబ జీవనానికి సంబంధించిన ఆచారాలు 2) పర్వతాలు,నదులు, యుద్ధం, పనులకు సంబంధించిన ఇతర పాటలు 3) సంచార తెగల గీతాలు 4) ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయ పాటలుగా విడదీసి వీటిని సేకరిస్తున్నారు మొత్తం ఈ పాటలను 24 కేటగిరిలుగా వర్గీకరించారు.కఠినమైన ప్రామాణీకరణ ప్రక్రియ తర్వాతే ముగ్గురు సభ్యుల బృందం ఈ గీతాలు సర్టిఫై చేస్తుంది.. ఆ తర్వాత వీటిని సాంస్కృతిక నిపుణులు, ప్రొఫెసర్లు, మానవపరిణామ శాస్త్రవేత్తలతో కూడిన ప్యానెల్ సమీక్షిస్తుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించకుండానే ప్రధానంగా ఎంపీ3 ఫైల్స్‌లో ఈ పాటలను ఏఐఆర్ భద్రపరుస్తోంది. దీనిని ఎప్పుడైనా, ఎలాంటి టెక్నాలజీలోకైనా డిజిటలైజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు లక్ష్యం ఈ గీతాలను ఏఐఆర్ ద్వారా ప్రసారం చేసేందుకు కాకుండా పరిశోధన, డాక్యుమెంటేషన్ కోసం భద్రపరచడం వరకే. సంగీత ‘సేకరణ’ సాగిందిలా..! స్థానికంగా ఉన్న ఆకాశవాణి సిబ్బంది , ఆయా గిరిజన తెగలకు చెందిన ప్రముఖులు, సంగీతకారులు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న గిరిజన సాహిత్యం తదితర రూపాల ద్వారా మౌలిక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సంగీత, వాయిద్యకారులు, గాయకుల వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేస్తారు. ఆడియో రికార్డులతో పాటు అన్ని పాటలను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఈ గీతాలను హిందీ,ఇంగ్లిష్‌లోకి అనువదిస్తారు. 2014లో హర్యానా, కశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలకు చెందిన సంగీతకారులు, బృందాలను షిల్లాంగ్‌కు రప్పించి వర్క్‌షాపును నిర్వహించారు. ఇందులోనే ఏఐఆర్ బృందం తొలుత సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కవే గాయకుడవడం అదృష్టం
వింజమూరి అనసూయ, సుప్రసిద్ధ జానపద సంగీత గాయని ఎనభై నాలుగేళ్ల స్నేహం రజనీ అన్నయ్యతో! నాకంటే ఒక ఏడాది పెద్దవాడనుకుంటాను. బాలాంత్రపు వారి కుటుంబం అంతా నాకు ఆప్తులే. వెంకట్రావు బాబయ్యగారు, పార్వతీశం మామయ్యగారు (వేంకట పార్వతీశ కవులు) నాకు సన్నిహితులు. బాలాంత్రపు నళినీ అన్నయ్య మా అందరికీ పెద్దన్నయ్య. నాగరాజు బావ, చెల్లాయి, సుభద్ర, శశాంక అందరూ నాకు కావలసిన వాళ్లే. పిఠాపురం నాకెందుకిష్టం అంటే, ఊరంతా నా వాళ్లే. దివాను గారి బంగళాల కెదురుగా ఉండే సందులో మొదటింట్లో (రంగనాయకులు గారిల్లు) మామయ్య కృష్ణశాస్త్రి ఉండేవాడు. సందు తిరగగానే మెయిన్ రోడ్డు మీద ఎడం పక్క మొదటిల్లు వెంకట్రావు బాబయ్యగారిది. దానికెదురుగా అవతల పక్కనున్న ఇల్లు పార్వతీశం మామయ్య గారిది. ఎడం పక్క వీరిళ్లయితే, కుడి పక్కన రంగనాయకులు లైబ్రరీ. నా చిన్నతనంలో వేంకట పార్వతీశ కవుల బెంగాలీ అనువాద నవలలు అన్నీ అక్కడే చదివాను. నా చిన్నతనం సగం కాకినాడలోనూ, సగం పిఠాపురంలోనూ గడిచింది. మామయ్యకు చాలాకాలం పిల్లలు లేరు. నేను మామయ్య గారాల చిన్నతల్లిని (నన్నలాగే పిలిచేవాడు). శనివారాలు, ఆది వారాలు వచ్చాయంటే కాకినాడ నుంచి నన్ను పిఠాపురం తీసుకొచ్చేవాడు. తర్వాత రజనీ అన్నయ్యా వాళ్లు కూడా కాకినాడకు మకాం మర్చారు. అప్పుడు తరచూ కలుసుకునేవాళ్లం. అప్పటికే నేను పెట్టిన ట్యూన్స్‌లో లలిత సంగీత కచేరీలు చేస్తున్నాను. రజనీ అన్నయ్య తను రాసిన ట్యూన్స్ పెట్టిన ‘చండీదాస్’ పాటలు వినిపించడానికి వచ్చేవారు. అప్పటి మా నాన్నగారి పద్ధతి ప్రకారం, రాత్రి 9 అయితే పిల్లలు చదువు ఆపి, దీపాలార్పి పడుకోవలసిందే. అప్పటికి మామయ్య కుటుంబం కూడా పిఠాపురం నుంచి మా ఇంటికి వచ్చేశారు. హాల్లో ముసలాళ్లూ, పిల్లలం పడుకునేవాళ్లం. రజనీ అన్నయ్య ఆ టైమ్‌కి వచ్చేవాడు తీరుబడిగా. ‘‘ప్రభ గారూ!’’ అని అన్నయ్యను పిలిచేవాడు. తలుపు తీసినా, లైట్ వేసినా పెద్దవాళ్లు దెబ్బలాడతారు. అందుచేత అన్నయ్యా, నేనూ కిటికీ దగ్గరే కూర్చునే వాళ్లం. కిటికీ అవతల ప్రక్క నిలబడి, చిన్న గొంతుతో తన పాటలు పాడి వినిపించేవాడు. ఇందులో ‘రామి’ (హీరోయిన్) కేరక్టరు పాటలు అనసూయ పాడాలని నిర్ణయంచుకుని రాసి, ట్యూన్ పెట్టాననే వాడు. నేనా రోజుల్లో మామయ్య రాసిన ‘వసంతోత్సవం’ సంగీత నాటికకు ట్యూన్స్ పెడుతున్నాను. మొదటిసారి ‘వసంతోత్సవం’ మద్రాసు రేడియోలో ప్రసారమైనప్పుడు, మామయ్య కుటుంబం, మా కుటుంబం, ప్రయాగ నరసింహశాస్త్రి, రజనీ అన్నయ్య, గాడేపల్లి సుందరమ్మ - అందరం పెళ్లివారు లాగ కాకినాడ నుంచి మద్రాసుకు వెళ్లాం. అప్పుడు రజనీ అన్నయ్య ‘వసంతుడు’, ప్రయాగ నరసింహశాస్త్రి అన్నయ్య ‘మలయ మారుతం’, గాడేపల్లి సుందరమ్మ ‘వేణువు’, నా చెల్లెలు వింజమూరి సీత - ‘కోయిల’, నేను - ‘తుమ్మెద’, బాలమ్మ, సుగంధి - ‘పువ్వులు’గా పాడాం. ఈనాటి వాగ్గేయ కారులలో రజనీ అన్నయ్య ఒకడు. కవే గాయకుడవడం ఎంతో అదృష్టం. తన భావాలకు తగిన సంగీతం కూర్చవచ్చు. త్యాగరాజు అందుచేతే అంత గొప్ప గాయకుడు కూడా అయ్యాడేమో! బాలాంత్రపు రజనీకాంతరావు కవి, గాయకుడు కూడాను. అనేకమైన లలిత సంగీతం ప్రోగ్రాములు, రేడియో ప్రోగ్రాములూ నేను రజనీ అన్నయ్యా కలిసి పాడినవి ఉన్నాయి. మేము పరస్పర అభిమాన సంఘాల వాళ్లం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మేము సమకాలికులం, సమ భావికులం, సమ గాయకులం.