హరన్‌సింఘా...దట్టమైన అడవి, కొండ, గుట్టలతో కూడిన జార్ణండ్ గ్రామం. ఒకప్పుడు నక్సలైట్లకు పెట్టనికోటగా నిలిచిన ప్రదేశం. ఈ ప్రాంతంలోనే వందల ఏళ్లుగా నివసిస్తున్న సంతాల్ గిరిజనతెగకు చెందిన వారిప్పుడు కొందరు ప్రత్యేక అతిథులకు సాదర స్వాగతం పలికారు. వారుమరెవరో కాదు.. గిరిజన భాష, జానపదసంగీతం మిణుకు మిణుకు మంటూ ఆరిపోకముందే వాటిని రికార్డ్ చేసేందుకు వచ్చిన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)కు చెందిన నిపుణులు. జానపద సంగీతం, సాహిత్యం కొడిగట్టకుండా, క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదమున్న సంతాలీ సంగీతాన్ని నిక్షిప్తం చేసేందుకు వారంతా కూడా భాగల్‌పూర్, బీహార్‌ల మీదుగా ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు...
కశ్మీర్ మొదలుకుని ఈశాన్యరాష్ట్రాలు... అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల వరకు నిత్యం ఘర్షణలు తలెత్తుతున్న కల్లోల ప్రాంతాల్లోని గిరిజనతెగల జానపద సంగీతాన్ని రికార్డ్ చేసే (ఆడియో, వీడియో) గురుతర బాధ్యతను ఏఐఆర్ స్వీకరించింది. 2014లో ఏఐఆర్ దేశవ్యాప్తంగా ఉన్న జానపద, గిరిజన సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. మొత్తం ఆరువేల వరకున్న గిరిజన కులాలు, తెగలు 16,500 భాషలు మాట్లాడుతున్నాయి. వాటిలోని 9 లక్షల పాటలను నిక్షిప్తం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 20 వేల గీతాలు రికార్ట్‌చేసింది. దేశంలోని 214 ఏఐఆర్ కేంద్రాల్లోని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ల సొంత చోరవతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కోసం ప్రత్యేక బడ్జెట్ లేదా వనరులేమి కేటాయించలేదు. ఈ అఖిల భారతస్థాయి ప్రాజెక్టును ఢిల్లీలోని త్రిసభ్యబృందం పర్యవేక్షిస్తోంది. ఏఐఆర్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా రిటైరైన సోమ్ దత్ శర్మ 1980లలో మొదటి పోస్టింగ్ రాంఛీలో పనిచేస్తునపుడు వివిధ గిరిజన తెగల భాషలు, సంగీతాన్ని రికార్డ్ చేశారు. అప్పుడే ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఇప్పుడు ఆయనే ‘ఆకాశవాణి లోక్ సంపద సంరక్షణ్ మహాపరియోజన’ పేరిట ఈ ప్రాజెక్టు సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుత ఏఐఆర్ డైరెక్టర్‌జనరల్ శశి శేఖర్ వెంపటి తీసుకున్న చోరవతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది.
సేకరణ ఎలా...?
1) కుటుంబ జీవనానికి సంబంధించిన ఆచారాలు 2) పర్వతాలు,నదులు, యుద్ధం, పనులకు సంబంధించిన ఇతర పాటలు 3) సంచార తెగల గీతాలు 4) ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయ పాటలుగా విడదీసి వీటిని సేకరిస్తున్నారు మొత్తం ఈ పాటలను 24 కేటగిరిలుగా వర్గీకరించారు.కఠినమైన ప్రామాణీకరణ ప్రక్రియ తర్వాతే ముగ్గురు సభ్యుల బృందం ఈ గీతాలు సర్టిఫై చేస్తుంది.. ఆ తర్వాత వీటిని సాంస్కృతిక నిపుణులు, ప్రొఫెసర్లు, మానవపరిణామ శాస్త్రవేత్తలతో కూడిన ప్యానెల్ సమీక్షిస్తుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించకుండానే ప్రధానంగా ఎంపీ3 ఫైల్స్‌లో ఈ పాటలను ఏఐఆర్ భద్రపరుస్తోంది. దీనిని ఎప్పుడైనా, ఎలాంటి టెక్నాలజీలోకైనా డిజిటలైజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు లక్ష్యం ఈ గీతాలను ఏఐఆర్ ద్వారా ప్రసారం చేసేందుకు కాకుండా పరిశోధన, డాక్యుమెంటేషన్ కోసం భద్రపరచడం వరకే.
సంగీత ‘సేకరణ’ సాగిందిలా..!
స్థానికంగా ఉన్న ఆకాశవాణి సిబ్బంది , ఆయా గిరిజన తెగలకు చెందిన ప్రముఖులు, సంగీతకారులు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న గిరిజన సాహిత్యం తదితర రూపాల ద్వారా మౌలిక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సంగీత, వాయిద్యకారులు, గాయకుల వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేస్తారు. ఆడియో రికార్డులతో పాటు అన్ని పాటలను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఈ గీతాలను హిందీ,ఇంగ్లిష్‌లోకి అనువదిస్తారు. 2014లో హర్యానా, కశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలకు చెందిన సంగీతకారులు, బృందాలను షిల్లాంగ్‌కు రప్పించి వర్క్‌షాపును నిర్వహించారు. ఇందులోనే ఏఐఆర్ బృందం తొలుత సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment