Aurobindo Message All India Radio Tiruchirappalli Broadcast - Sakshi
Sakshi News home page

‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం!

Published Tue, Aug 15 2023 9:03 AM | Last Updated on Tue, Aug 15 2023 10:31 AM

Aurobindo Message All India Radio Thiruchirapalli broadcast - Sakshi

అరబిందో ఘోష్‌.. ‍ప్రముఖ భారతీయ తత్వవేత్త, యోగి, మహర్షి, కవి, పాత్రికేయుడు. 1872 ఆగస్టు 15న అరబిందో ఘోష్‌ జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆల్‌ ఇండియా రేడియో, తిరుచిరాపల్లి అభ్యర్థన మేరకు అరబిందో స్వాతంత్ర్య ఉద్యమ సందేశాన్ని అందించారు. అది 1947 ఆగస్టు 14న రేడియోలో ప్రసారమయ్యింది.
 
‘ఈ రోజే నా పుట్టినరోజు యాదృచ్చికం’
‘ఆగస్ట్ 15 నా పుట్టినరోజు. దేశానికి స్వాతంత్ర్యం దక్కిన రోజే నా పుట్టినరోజు కావడం సహజంగానే నాకు సంతోషాన్నిస్తుంది. నేను ఈ యాదృచ్చిక సంఘటనను సాధారణమైనదిగా కాకుండా, నేను చేపడుతున్న పనుల విషయంలో నా దశలను మార్గనిర్దేశం చేసే దైవిక శక్తి ఆమోద ముద్రగా తీసుకుంటాను. ఈ రోజున నేను నా జీవితకాలంలో నెరవేరాలని ఆశించిన అతిపెద్ద కలను చూడగలిగాను. గతంలో అవి ఆచరణ సాధ్యం కాని కలల మాదిరిగా కనిపించాయి. ఇప్పుడు అవి ఫలించాయి. సాధించే మార్గంలోనూ కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాలన్నింటిలో స్వేచ్ఛా భారతదేశం  అనేది అగ్రగామిగా నిలిచింది.

‘భారత్‌ శక్తిమంతం కానుంది’
నేను కన్న కలలలో మొదటిది స్వేచ్ఛాయుత ఐక్య భారతదేశాన్ని సృష్టించడం. భారతదేశం నేడు స్వేచ్ఛగా ఉంది. కానీ ఐక్యతను సాధించలేదు. బ్రిటిష్ ఆక్రమణకు ముందు ఉన్న ప్రత్యేక రాష్ట్రాల గందరగోళం తిరిగి చోటుచేసుకుంటుందనే భావన ఏర్పడుతోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ముప్పు తప్పే చర్యలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యూనియన్ స్థాపితమవనప్పటికీ, ఇది శక్తివంతమైనదిగా మారనున్నదని తెలుస్తోంది. రాజ్యాంగ సభ తీసుకున్న తెలివైన, కఠినమైన విధానం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి దోహదపడేలా ఉంది. అలాగే విభేదాలు, చీలికలు లేకుండా పరిష్కారానికి అవకాశం ఏర్పడనుంది. 
ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్‌లైన్‌ సెల్ఫీ కంటెస్ట్..

‘మతపరమైన విభజన భావన తగదు’
అయితే హిందువులు, ముస్లింలు అనే మతపరమైన విభజన ఇప్పుడు దేశంలో శాశ్వత రాజకీయ విభజనగా మారింది. ఈ వాస్తవం తాత్కాలిక అంగీకారంగానే ఉండాలి. ఒకవేళ ఇదే కొనసాగితే భారతదేశం తీవ్రంగా బలహీనపడవచ్చు. అప్పుడు అంగవైకల్యం బారినపడినట్లవుతుంది. అలాంటప్పుడు దేశపౌరుల మధ్య కలహాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయి. కొత్త దండయాత్రలు, విదేశీ ఆక్రమణలకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. భారతదేశ అంతర్గత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆటంకం ఏర్పడుతుంది. విదేశాలలో భారత్‌ స్థానం బలహీనపడవచ్చు. దేశ విభజన జరగాలి. అయితే శాంతి, సామరస్యాల ఆవశ్యకతను గుర్తించడం ద్వారా దేశంలో  ఐక్యత ఏర్పడుతుంది. ఇది భారతదేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం.

‘స్వేచ్ఛాయుత పోరాటాల్లో భారత్‌ కీలకం’
నేను కన్న మరో కల ఆసియావాసుల పునరుజ్జీవనం, విముక్తి. మానవ నాగరికత గొప్ప పురోగతి సాధించడం. ఆసియా ఉద్భవించింది. చాలా దేశాలు ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉన్నాయి. మరికొన్ని విముక్తి పొందుతున్నాయి. కొన్ని దేశాల్లో స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగుతున్నాయి. నేడోరోపో వారి కలలు నెరవేరనున్నాయి. వీటిలో భారతదేశం తన కీలక పాత్రను పోషించవలసి ఉంది. శక్తి , సామర్థ్యాలను చాటాల్సిన అవసరం ఉంది. ఇది వినూత్న అవకాశాలను అందించడమే కాకుండా, వివిధ దేశాల కౌన్సిల్‌లో ప్రత్యేక స్థానాన్ని నిలబెడుతుంది.

‘ప్రపంచ ఏకీకరణ అత్యవసరం’
నా మూడవ కల మానవ ప్రపంచ ఏకీకరణ. ఇది ప్రస్తుతం జరుగుతోంది. దీనిలో కూడా భారతదేశం ప్రముఖ పాత్రను పోషించడం ప్రారంభించింది. ప్రస్తుత వాస్తవాలు, తక్షణ అవకాశాలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తును గుర్తించి, రాజనీతిజ్ఞతను పెంపొందించుకోగలిగితే దేశ ఉనికి మరింతగా గుర్తింపు పొందుతుంది. ఏకీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఒక అనివార్య ఉద్యమం. అన్ని దేశాలకు దాని ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఐక్యత లేనప్పుడు చిన్నచిన్న దేశాల స్వేచ్ఛ ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఇందుకు అంతర్జాతీయ స్ఫూర్తి, దృక్పథం మరింతగా పెరగాలి. ద్వంద్వ లేదా బహుపాక్షిక పౌరసత్వం, వివిధ సంస్కృతుల స్వచ్ఛంద కలయిక వంటి పరిణామాలు జరగాలి. ఏకత్వపు  స్ఫూర్తి మానవ జాతి ‍ప్రగతికి ఆధారంగా నిలుస్తుంది. 

నాకున్న మరో కల ప్రపంచానికి భారతదేశం  ఆధ్యాత్మిక బహుమతిని అందివ్వాలి. అది ఇప్పటికే ప్రారంభమైంది. భారతదేశ ఆధ్యాత్మికత యూరప్, అమెరికాలో నానాటికీ  మరింతగా ప్రవేశిస్తోంది. కేవలం బోధనలకు మాత్రమే పరిమితం కాకుండా మానసిక, ఆధ్యాత్మిక సాధనలకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.

‘పశ్చిమ దేశాలలో భారత్‌కు పట్టు’
నా చివరి కల నాగరికతా పరిణామంలో మరో అడుగు. ఇది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకు వెళుతుంది. వ్యక్తిగత పరిపూర్ణత, పరిపూర్ణ సమాజం ఏర్పాటుకు దారితీస్తుంది. సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. ఈ దిశగా కదులుతున్న భారతదేశం.. పశ్చిమ దేశాలలో పట్టు సాధించడం ప్రారంభించింది. ఘనమైన సంకల్పం ఉంటే అన్ని సమస్యలు సమసిపోతాయి. ఈ పరిణామం చోటుచేసుకోవాలంటే ప్రజలు అంతర్గత స్పృహను కలిగివుంటూ ముందుకు సాగాలి. ఈ చొరవ భారతదేశం నుండే మొదలుకావచ్చు. భారతదేశానికి విముక్తి  కలిగిన రోజున నా ఆశ ఎంతవరకు నేరవేరుతుందనేది స్వేచ్ఛాయుత భారతదేశంపై ఆధారపడి ఉంటుంది’ అని అరబిందో పేర్కొన్నారు. అరబిందో ఘోష్‌ 1950 డిసెంబర్‌ 5న కన్నుమూశారు. 
ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్‌-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement