
తెలంగాణ ‘పవర్’ ఫుల్
కేసీఆర్ కు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు లభించాయి. అత్యంత గడ్డు పరిస్థితి నుంచి కోతల్లేకుండా కరెంటు అందించేస్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవటం మామూలు విషయంకాదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌తో రమణ్‌సింగ్ సమావేశమయ్యారు. భేటీలో ముందుగా విద్యుత్ గురించి ప్రస్తావించారు. ‘నేను హైదరాబాద్‌లో దిగగానే కారెక్కాను.
రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏమిటని డ్రైవర్‌ను ఆరా తీయగా మా రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు కోతలు లేవని చెప్పాడు. ఇంతకు ముందు కరెంటుకు చాలా కష్టముండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కష్టాలు పోయాయని చెప్పాడు. రోజుకు సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేకుండా కరెంటివ్వడం మామూలు విషయం కాదు.’ అని రమణ్‌సింగ్ అన్నారు. భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో సోలార్ రంగంలో 2700 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ తీసుకురావడానికి అవసరమైన లైన్ నిర్మాణం పూర్తయ్యే దిశగా పని చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.
రెండు రాష్ట్రాల్లోని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతరత్రా విషయాలను చర్చించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన నయా రాయపూర్ నిర్మాణ పురోగతి గురించి రమణ్‌సింగ్‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న పలు కార్యక్రమాల గురించి రమణ్‌సింగ్ అడిగి తెలుసుకున్నారు. ‘మీరు బాగా పని చేస్తున్నారు. మీలాగే మేము కూడా భవిష్యత్తులో తయారవుతాం. మంచి కార్యక్రమాలు అమలు చేస్తాం.’ అని రమణ్‌సింగ్ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రమణ్‌సింగ్‌కు శాలువా కప్పి చార్మినార్ జ్ఞాపికను అందించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రవీందర్‌రావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.