సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఆకలి బాధ పడకూడదని.. రేషన్ కార్డు ఉన్నా, లేకున్నా బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. కొత్త కార్డు కోసం ప్రభుత్వానికి విన్నవించుకుని నెలలు గడుస్తున్నా.. అవి మంజూరు కాక, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి నోచుకోని వారంతా సీఎం ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికీ ఇప్పుడు బియ్యం అందనుంది.
రాష్ట్రంలో చాలా నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని క్షేత్ర స్థాయి పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగాయి. మీ–సేవ ద్వారా ఆహార భద్రతా కార్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లౌన్ ద్వారా కొత్త కార్డులు, రదై్దన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా, చాలా వరకు పరిష్కారం దొరకలేదు. గత జూన్, జూలైలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రత్యేక బృందాలను నియమించి ఏడు రోజుల్లో కార్డులు జారీ చేయాలని ఆదేశించినా ఈ ప్రక్రియ నామమాత్రంగానే సాగింది.
గ్రేటర్‌లోనే అత్యధికం...
గత డిసెంబర్ నాటికి కొత్త దరఖాస్తుల సంఖ్య 4.44 లక్షలుగా ఉండగా, ఇందులో 1.62 లక్షల మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. మరో 2.82 లక్షల మందికి కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ మూడు నెలల కాలంలో మరో 20 వేల దరఖాస్తులు వచ్చినా కొత్త కార్డు దరఖాస్తులు 3 లక్షలకు చేరినట్లు సమాచారం. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా యంత్రాంగాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 80వేల దరఖాస్తులు, రంగారెడ్డి పరిధిలో 60వేలు, మేడ్చల్ పరిధిలో 25వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా.
పూర్వ నల్లగొండ జిల్లా మొత్తంగా 40 నుంచి 50వేలు, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మరో 30వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయితే పెండింగ్ దరఖాస్తుదారులకు బియ్యం పంపిణీ చేయడం లేదన్న అంశా న్ని విలేకరులు సోమవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేసీఆర్, రాష్ట్రంలోని వలస కార్మికులకే రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలకు బియ్యం అందడం లేదన్న అంశమే తలెత్తరాదన్నారు. బియ్యం అందని వారెవరైనా ఉంటే, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బియ్యం ఇప్పించాలని సూచిం చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని తెలిపారు. రేషన్ దరఖాస్తుదారులకు ఈ ప్రకటన పెద్ద ఉపశమనం కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment