డిపెండెంట్‌ ఉద్యోగులకు ‘కారుణ్య’ మార్గం | CM KCR Promises to Fill Hereditary jobs in Singareni | Sakshi
Sakshi News home page

డిపెండెంట్‌ ఉద్యోగులకు ‘కారుణ్య’ మార్గం

Published Sat, Sep 30 2017 2:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

CM KCR Promises to Fill Hereditary jobs in Singareni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులు ఎంతగానో ఎదురుచూస్తున్న డిపెండెంట్‌ ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా పోదని.. వాటిని కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దాంతోపాటు ఇతరుల పేరుతో ఉద్యోగాలు చేస్తున్నవారిని సొంత పేరుతో క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా ఉన్న జాతీయ సంఘాల వల్లే కార్మికులు తమ హక్కులు కోల్పోయారని.. ఇప్పుడు తాము ఆ హక్కులను పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా తనపై ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..  

ఉద్యోగాలు పోగొట్టిందే జాతీయ సంఘాలు
‘‘రాష్ట్రంలో గడిచిన 58 ఏళ్లలో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది కాంగ్రెస్, మరో 17 ఏళ్లపైన టీడీపీ. వీరికి మిత్రపక్షంగానో, ఒక్కోసారి శత్రుపక్షంగానో వ్యవహరించిన సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయూసీలే సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా పనిచేశాయి. సింగరేణిలో జరిగిన విధ్వంసం గురించి కార్మికులకు తెలుసు. జాతీయ పార్టీలు, జాతీయ సంఘాల వల్లే కార్మికులు హక్కులు కోల్పోయారు. 1998లో ప్రాథమికంగా, 2002లో డిపెండెంట్‌ ఉద్యోగాలు పోయేలా జాతీయ సంఘాలన్నీ కలసి సంతకం పెట్టాయి. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటామంటూ సంతకాలు పెట్టని అనుబంధ సంఘమే లేదు. ఇలా బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ వంటి సోకాల్డ్‌ జాతీయ సంఘాలే కార్మికుల హక్కులను కాలరాశాయి.

సింగరేణి కార్మికుల సమస్యలు అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్‌లు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ ఆత్మ లేకనో, కార్మికులంటే పట్టింపు లేకనో ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి తగిన ఆక్సిజన్‌ కూడా అందదు. మోకాలు చిప్పలు అరిగిపోతాయి. పదవీవిరమణ చేసిన సింగరేణి కార్మికుడెవరూ నాకు తెలిసి పదేళ్లకు మించి బతకరు. మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ మరీ దారుణం. కేవలం ప్రధానమైన ఐదు వ్యాధులే ఉన్నాయి. సింగరేణి భూగర్భ గనుల్లో పనిచేసే వారికి వచ్చే జబ్బులను అందులో చేర్చలేదు.

ఉద్యోగాలిస్తామంటే కోర్టు కేసులా?
టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా తొలిసారి గెలిచాక.. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాం. కానీ కొందరు దీనిపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టు స్టే ఇస్తే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నాయి. ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఠా 17 కేసులు వేసింది. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు మరో ముఠా ఉంది. ఆ ముఠాల వివరాలు త్వరలోనే బయటపెడతం. éవారసత్వ ఉద్యోగాలపై న్యాయసలహా తీసుకున్నాం. ఏజీతో, రిటైర్డ్‌ జడ్జిలతో మాట్లాడాం. సింగరేణి ఒక కంపెనీ.. బైలాస్‌ రూపొందించుకోవచ్చు. కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం. డిపెండెంట్‌ ఉద్యోగం వద్దనుకున్న వారు రూ.25 లక్షల ప్యాకేజీ అయినా తీసుకోవచ్చు. లేదా నెలవారీ జీతం తీసుకోవచ్చు.. లేదా వారసత్వ ఉద్యోగం పొందవచ్చు. ఒక్క డిపెండెంట్‌ ఉద్యోగం కూడా పోనివ్వం. సింగరేణిలో 14 వేల నుంచి 19 వేల మంది అలియాస్, పైపేరు, దొంగపేరు అంటూ డూప్లికేట్‌ కార్మికులున్నారు. వారికి అందరితోనూ సమస్యే. ఎవరు ఫిర్యాదు చేసినా వీరి మెడపై కత్తి వేలాడుతుంది. ఈ పాపం కూడా జాతీయ సంఘాలదే. ఇలా డూప్లికేట్‌ ఉద్యోగాలు చేస్తున్న వారిని సొంత పేరుతో రెగ్యులరైజ్‌ చేస్తాం. 40–50 రోజుల్లోనే ఈ పని పూర్తి చేస్తాం. సింగరేణి ఉద్యోగులకు ‘రిఫరెల్‌ మెడికల్‌ ఫెసిలిటీ’కింద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశముంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులకు కూడా వైద్యం చేయించుకునే అవకాశం కల్పిస్తాం.

రుణ సహాయం కూడా..
సింగరేణి కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 6 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తాం. లాభాల్లో కార్మికులకు ఉన్న 16 శాతం వాటాను మేం 25 శాతానికి పెంచాం. దసరాకు ఇచ్చే రూ.8 వేల అడ్వాన్సును రూ.25 వేలకు పెంచినం. రూ.175 కోట్ల వృత్తి పన్నును రద్దు చేసినం. వారికి ఆదాయపన్ను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. దీనిపై వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రంతో యుద్ధం చేస్తారు. సింగరేణి గనులున్న ఇతర ప్రాంతాల ఎంపీల మద్దతునూ కూడగడతం. ప్రమాదాల్లో చనిపోయే కార్మికుల కుటుంబాలకు పరిహారం కేవలం రూ.లక్ష ఉండేది. టీఆర్‌ఎస్‌ పోరాటంతో నాటి సీఎం చంద్రబాబు రూ.6 లక్షలకు పెంచారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ. 25 లక్షలకు పెంచాం. ఏఐటీయూసీ అసమర్థత వల్ల 3,527 ఉద్యోగాలు పెండింగ్‌లో పడిపోతే.. టీబీజీకేఎస్‌ వచ్చాక ఒకేసారి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. 1989 తర్వాత సింగరేణిలో కొత్తగా ఉద్యోగాల నియామకం జరగలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 7 వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం.

కారుణ్య నియామకాలను సమర్థిస్తారా.. లేదా?
జాతీయ సంఘాలను ఒక్కటే అడగదలుచుకున్నా... వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా పూర్తి చేయాలని నిర్ణయించాం. దీనికి జాతీయ సంఘాలు మద్దతు తెలుపుతాయా? లేదంటే ముసుగువీరుల్లా కేసులు వేస్తారా? సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ అన్నీ ఒక్కటయ్యాయి. మా ఒక్కరి మీద కొట్లాడలేక ఒక్కటయ్యారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో, పాలేరు ఉప ఎన్నికల్లో ఒకటైనట్లు.. సింగరేణిలో అదే దుకాణం పెట్టిండ్రు. మా అంచనా మేరకు సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్‌ గెలుస్తుంది. గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తది. ఏ సంఘమైనా, పార్టీ అయినా ఎన్నికల్లో కొట్లాడేది గెలవడానికే. ఇంట్లో పడుకోవడానికి కాదు. ఏఐటీయూసీ నాయకులను ప్రలోభపెడుతున్నామని ఆరోపిస్తున్నారు. అంత బలహీనమైన సంఘమా అది?..

సంస్థలను నిలబెట్టకుంటున్నం
సమైక్య పాలనలో ఆర్టీసీ నెత్తిపై కత్తి వేలాడేది. ఎప్పుడు ప్రైవేటుపరం చేస్తారో తెలిసేది కాదు. మేం రూ.700 కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇచ్చి నిలబెట్టినం. విద్యుత్‌ సంస్థ కూడా అంతే. ఉత్పత్తి పోగొట్టి ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు. 6 వేల మెగావాట్ల ప్రాజెక్టులు జెన్‌కోకు ఇచ్చి కాపాడినం. కార్మికుల శ్రేయస్సు కోరి విద్యుత్‌ సంస్థల్లో 25 వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. 1.10 లక్షల మంది ఉద్యోగులు ఉన్న సింగరేణిని 50 వేల ఉద్యోగులకు తెచ్చింది కాంగ్రెస్, టీడీపీలే.. మేం సింగరేణికి పూర్వ వైభవం తెస్తున్నాం. ఈ సంస్థకు 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశమిచ్చాం. ఆ లాభాలు సింగరేణికే ఇస్తం. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం ఫోజులు కొడుతోంది. అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశాన్ని, అక్కడి గనులను సింగరేణికి అప్పగిస్తాం. కొత్త భూగర్భ గనులను ప్రారంభిస్తాం. ఇక నుంచి ప్రతి నెలా రెండు గంటల పాటు సింగరేణిపై సమీక్ష నిర్వహిస్తా..

తాడూ బొంగరం లేనోళ్లు ఏమైనా మాట్లాడుతరు
అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు సమన్వయ సమితులను ఏర్పాటు చేద్దామనుకున్నాం. దానిపైన కూడా కోర్టుకు పోతరా..? ఇదేం చిల్లర రాజకీయం. రైతులకు మేలు చేస్తామంటే ఇంత అసహనమా? తాడూ బొంగరం లేనోళ్లు ఏమైనా మాట్లాడుతరు. వాళ్లకు సమాధానం ఇవ్వాలా?
 
నెలరోజుల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
జర్నలిస్టులందరికీ దసరా శుభాకాంక్షలు. నెల రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కూడా పెంచుతాం. దసరా పండుగ తర్వాత మీడియా కమిటీ చైర్మన్‌ అల్లం నారాయణతో సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలపై చర్చిస్తా. ఇప్పటికే రెండు మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పరిశీలన జరిగింది. వీలైతే ఒకే చోట స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకే చెప్పేసింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement