ఎవర్‌ గ్రీన్‌ సిటీ | CM KCR review meeting held in Pragati Bhavan | Sakshi
Sakshi News home page

ఎవర్‌ గ్రీన్‌ సిటీ

Published Sat, Aug 12 2017 1:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

ఎవర్‌ గ్రీన్‌ సిటీ - Sakshi

ఎవర్‌ గ్రీన్‌ సిటీ

  • నగరాభివృద్ధిపై సమీక్షలో అధికారులకు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం
  • నగరంలో మంచినీటి సరఫరాకు 2 రిజర్వాయర్లు
  • ‘కాళేశ్వరం, పాలమూరు’ ద్వారా వాటిల్లోకి నీళ్లు
  • ఓఆర్‌ఆర్‌ పొడవునా దారికి ఇరువైపులా మొక్కలు
  • సిటీలో పచ్చదనం కోసం ఐఎఫ్‌ఎస్‌ అధికారి
  • సాక్షి, హైదరాబాద్‌
    హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరం కోసం 2 మంచినీటి రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు రహదారులు, మురికి కాల్వలు, వరద కాల్వలు, విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం, రవాణా సదుపాయాలు, మార్కెట్లు, టాయిలెట్లు, పచ్చదనం తదితర అంశాల్లో నగరం ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

    శుక్రవారం నగరాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషీ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణ, నవీన్‌ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, వాటర్‌ వర్క్స్‌ కమిషనర్‌ దానకిషోర్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    అవసరాలు ముందుగానే గుర్తించాలి
    ‘‘హైదరాబాద్‌ శరవేగంగా పెరుగుతోంది. పెరిగే జనాభాకు అనుగుణంగా అవసరాలూ పెరుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ప్రణాళికలు వేయాలి. రాబోయే 30 ఏళ్లకు నగరం ఎలా ఉంటుంది? జనాభా ఎంత పెరుగుతుంది? అప్పుడు ఏర్పడే అవసరాలేంటి అన్న అంచనాలు ఉండాలి. అందుకు అనుగుణంగా ఇప్పట్నుంచే ఏర్పాట్లు ఎలా చేయాలి అని ఆలోచించాలి. కనీసం పదేళ్ల కోసం కార్యాచరణ ప్రణాళిక వేయాలి. ఇప్పట్నుంచి చేసే ప్రతీ పని ఆ ప్రణాళికలో భాగమై ఉండాలి’’ అని సీఎం అధికారులకు నిర్దేశించారు.

    శుక్రవారం ప్రగతి భవన్‌లో నగర అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు

    ‘‘ప్రజలకు నిరంతర కరెంటు ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. అందులో విజయం సాధించాం. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు కడుతున్నాం. విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు బాగా సాగుతున్నాయి. ఇక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలి. ముఖ్యంగా హైదరాబాద్లోనే కోటి జనాభా ఉంది. ఈ నగరంపై అత్యంత ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ పోవాలి’’ అని సూచించారు.

    సీఎం చేసిన సూచనలివీ..

    • హైదరాబాద్‌ మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన రెండు రిజర్వాయర్లు నిర్మించాలి. గోదావరి నదిపై కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రిజర్వాయర్‌ను, కృష్ణాపై కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో రిజర్వాయర్‌ను నింపాలి. గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసి, 10–15 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ఈ రిజర్వాయర్లు నిర్మించాలి. సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే ఈ పనులు ప్రారంభించాలి.
    • హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతోంది. పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది. నగరం చుట్టూ ఉన్న వేలాది అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలి. నాగోల్, నారపల్లి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల అటవీ భూమి ఉంది. శంషాబాద్‌ విమానాశ్రయం ప్రాంతంలో ఓఆర్‌ఆర్‌ అవతల మరో 16 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. నర్సాపూర్, శివంపేట ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో అటవీ భూమి ఉంది. వీటన్నింటింలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. ఓఆర్‌ఆర్‌ పొడవునా ఇరువైపులా వేప, గుల్మోర్, రావి చెట్లు నాటాలి. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో పచ్చదనం ఉండాలి. మున్సిపల్‌ శాఖ మంత్రి పేషీలో నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షించడం కోసం ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలి.
    • నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. అందుకు బస్తీ కమిటీలు వేయాలి. ప్రతీ డివిజన్‌కు 10 కమిటీలు ఉండాలి. 15 రోజుల్లోగా కమిటీల నియామకం పూర్తి కావాలి. ప్రజలందరినీ కలుపుకుని బస్తీలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం తదితర విషయాల్లో ఆ కమిటీలు కీలకంగా పని చేస్తాయి.
    • గండిపేట, హిమాయత్‌ సాగర్, శామీర్‌ పేటతోపాటు నగరంలో, నగరం చుట్టూ అనేక చెరువులున్నాయి. వాటిలో పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యం చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మురికి నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక కాల్వలు నిర్మించాలి.
    • నగరంలో కొత్తగా కట్టే నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సందర్భంలో అధికారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
    • సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తరహాలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేయాలి. మూసీలో మురికి నీరు చేరకుండా చూడాలి. మురికి నీరు పోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మూసీకి రెండు వైపులా ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలి. మూసీ మీదుగా ఓఆర్‌ఆర్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు రహదారి నిర్మించాలి. మూసీ నది దాటడానికి పలుచోట్ల వంతెనలు నిర్మించాలి.
    • నగరంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇళ్లపై తీగలను తొలగించాలి. నగరంలో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.
    • ఎస్‌.ఆర్‌.డి.పి.లో భాగంగా నిర్మించే రహదారుల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉప్పల్‌ వంటి ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అండర్‌ పాస్‌లు నిర్మించే సందర్భంలో వర్షం, వరద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement