బడ్జెట్‌లో వాస్తవాలే ప్రతిబింబించాలి
ఉన్నతాధికారులతో సమీక్షలో కేసీఆర్ దిశానిర్దేశం
మూడు రంగాలకు పెద్దపీట వేస్తూ సమగ్రంగా రూపకల్పన
పేదలు-సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు-పెట్టుబడులపై దృష్టి
కేంద్ర విధానాలకు అనుగుణంగా రాష్ర్టంలో చర్యలు
సుపరిపాలన దిశగా పది కార్యక్రమాలు
ఆదివారం కూడా షాపులు, కార్మికులకు వీక్లీ ఆఫ్ తప్పనిసరి
నెలలో రెండు రోజులు స్వచ్ఛ భారత్
ఏటా జూలై తొలివారంలో హరితహారం కార్యక్రమం
ఫిబ్రవరి చివర్లో మిషన్ కాకతీయ వారోత్సవాలు
పకడ్బందీగా గృహ నిర్మాణ పథకం అమలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వాస్తవాల ఆధారంగా మంచీచెడులను ప్రజలకు విడమరిచి చెప్పాలని, ఎలాంటి దాపరికం అవసరం లేదని స్పష్టంచేశారు. పేదలు-సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు-పెట్టుబడులు-మౌలిక వసతులు.. ఈ మూడు రంగాల అభివృద్ధికి అవసరమయ్యే విధానాల రూపకల్పన జరగాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న అవగాహన, పరిమిత వనరులు, అవకాశాల మేరకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అది ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించిందన్నారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు కూడా పాల్గొన్నారు.
కేంద్రంలో కొత్త ఒరవడి
కేంద్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దేశాన్ని నూతన పంథాలో నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం అన్నారు. గతంలో సీఎంగా పని చేసిన వ్యక్తే ప్రధానిగా ఉండటం రాష్ట్రాలకు సానుకూల అంశమని విశ్లేషించారు. కేంద్ర పథకాలను కుదిస్తున్నారని, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో కూడా సమూల మార్పులు రానున్నాయని, ఇంకా అనేక కొత్త ఆలోచనలకు కేంద్రం శ్రీకారం చుడుతోందని చెప్పారు. కేంద్ర విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను రూపొందించుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. పరిణామక్రమంలో చాలా మార్పులు జరుగుతాయని, అందులో భాగంగానే మోదీ సర్కారు నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రైవేటు రంగాన్ని విస్మరించే పరిస్థితి లేదనిఅభిప్రాయపడ్డారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ర్టంలో పనిచేస్తున్న అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని సీఎం కితాబిచ్చారు. సమయ పరిమితులు పెట్టుకోకుండా పొద్దు పోయేంతవరకు పని చేస్తూ సేవలు అందిస్తున్నారని అభినందించారు. కేవలం తమ శాఖలకు బాధ్యులుగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారథులుగా వ్యవహరించాలని సూచించారు. తరుచు చర్చలు నిర్వహించి మంచి విధానాలు రూపొందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలన్నింటిపై అధికారుల వద్ద సమగ్రమైన సమాచారం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు.
సుపరిపాలన అందిద్దాం
తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారులు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి.. సుపరిపాలన దిశగా పది కార్యక్రమాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి నెలా ఒకటి, మూడో శనివారాల్లో దీన్ని చేపట్టాలని, అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర కార్యక్షేత్రాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఆదివారం కూడా తెరిచి ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసేందుకు కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారమంతా పనిచేసే ఉద్యోగులు ఆదివారం షాపింగ్ చేయడానికి వీలుండటం లేదని, అందుకే ఈ దిశగా చర్య తీసుకోవాలని చెప్పారు. అలాగే వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారు నిర్ణీత సమయం కన్నా ఎక్కువ గంటలు పని చేయించకుండా చూడాలని, వీక్లీ ఆఫ్ విధానాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
ఏటా జూలై తొలివారంలో హరితహారం వారోత్సవాలు నిర్వహించాలన్నారు. మండల, మున్సిపల్ సమావేశాలకు అటవీ శాఖ అధికారులను కూడా ఆహ్వానించి సమీక్ష జరపాలన్నారు. రాష్ర్టవ్యాప్తంగా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ఇక ఏటా ఫిబ్రవరి చివరి వారంలో మిషన్ కాకతీయ వారోత్సవాలు జరపాలని, ప్రజల భాగస్వామ్యంతో చెరువులను పునరుద్ధరించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని , ఎస్సీఎస్టీల సమగ్రాభివృద్ధికి శాఖలవారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, బీసీల్లోని సంచార జాతులు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు.
పరిశ్రమలకు సరిపడేంత కరెంట్
అనుకూలమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు, తగినంత భూమి ఉండటం వల్ల పెట్టుబడులకు రాష్ర్టం ఆకర్షణీయంగా ఉందని కేసీఆర్ వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని గొప్ప పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. సింగిల్ విండో విధానం, ఒకే చోట అన్ని అనుమతులను 15 రోజుల్లో పొందడం, టీఎస్‌ఐపాస్ చట్టం, పారిశ్రామిక అనుమతులకు సీఎంవోలో ప్రత్యేక విభాగం తదితర చర్యలతో రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వస్తాయన్నారు.
ప్రస్తుతం కరెంటు విషయంలో ఇబ్బంది ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని వివరించారు. 2018 చివరి నాటికి రాష్ట్రంలో 23 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చివరిలోగా 6679 మెగావాట్ల కరెంట్ అందుబాటులోకి వస్తుందని, దాంతో కరెంటు కష్టాలు చాలా వ రకు తీరుతాయన్నారు. పరిశ్రమలకు చాలినంత విద్యుత్ అందిస్తామని చెప్పారు.
దాపరికం వద్దు
Published Fri, Feb 13 2015 1:13 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement