
బడ్జెట్‌పై అంచనా తప్పలేదు
ఆదాయం రాబట్టుకోడానికి సర్వశక్తులు ఒడ్డుతాం: కేసీఆర్
⇒ బడ్జెట్ లెక్కలపై వివరణ.. గత ఏడాది రూ. 34,500 కోట్ల ఆదాయం తగ్గింది
⇒ భూములను అమ్మితీరుతాం.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాని రుణాలు తీసుకుంటాం
⇒ రూ. 4 వేల కోట్ల పన్ను బకాయిల వసూలు.. కరెంట్ చార్జీలు పెంచక తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్‌పై ప్రభుత్వ అంచనాలేవీ తప్పుగా లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం అసెంబ్లీలోవివరణ ఇచ్చారు.
‘ఆదాయం రాబట్టుకునేం దుకు సర్వశక్తులు ఒడ్డుతాం.వస్తే ఖర్చు చేస్తాం. లేదంటే శాసనసభకు లెక్కలు అప్పజెబుతాం. ఇందులో అనవసరమైన గొప్పలకు పోయేదేమీ లేదు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే కదా.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది’ అని కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని పేర్కొంటూనే మిగతా వర్గాలపై కొంత మేరకు విద్యుత్ చార్జీల భారం తప్పదని వెల్లడించారు.
బడ్జెట్‌పై చర్చలో భాగంగా సీఎల్పీనేత జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఊహాజనిత బడ్జెట్‌ను రూపొందించిందని, అసాధ్యమైన ఆదాయ అంచనాలు, ప్రణాళిక వ్యయాన్ని చూపించారని విమర్శిం చిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ, గ్రాంట్లు, ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకా రం అప్పుల పరిమితి, భూముల అమ్మకం వంటి ఆదాయాలను ఊహించి చెప్పారని జానా ధ్వజమెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు.
అన్నీ పక్కాగా లెక్కలేసుకున్నాం..
పదినెలల్లో రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల ఆదా యం వచ్చిందని, అంతమేరకు ఖర్చు కూడా చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అనూహ్యంగా40 శాతం కోత పడటంతో రూ.28 వేల కోట్లు రాలేదన్నా రు. భూముల అమ్మకం ద్వారా రూ. 6,500 కోట్లు అంచనా వేసుకుంటే.. ఒక్క గుంట భూమిని కూడా అమ్మ లేదని, అమ్మే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. చౌకగా అమ్మి దుబారా చేయడం కంటే భూముల విలువ ఎక్కువగా ఉన్నప్పుడే అమ్మాలన్న ఆలోచనతో దీన్ని పెండింగ్‌లో పెట్టామన్నారు.
దీంతో రూ. 34,500 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. కొన్ని బడ్జెట్‌లో చెప్పుకునేవి ఉంటాయని.. మరికొన్ని బడ్జెట్ పరిధిలో లేని అం శాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎన్టీపీసీతోపాటు రాష్ట్రంలో నిర్మించబోయే విద్యుత్ ప్రాజెక్టులకు రూ.79 వేల కోట్లు ఖర్చవుతుం దని.. ఆర్‌ఎఫ్‌సీ, పీఎఫ్‌సీల ద్వారా రూ.15 వేల కోట్ల రుణం సమకూరుతుందన్నారు. వాటర్‌గ్రిడ్‌కు దాదాపు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని.. అందులో రూ.10 వేల కోట్లు హడ్కో రుణం, రూ.3 వేల కోట్లు నాబార్డు రుణం అందుతున్నారు. రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ సిద్ధంగా ఉందని.. ఐసీఐసీఐ, జిందాల్, ఎల్‌ఐసీ కంపెనీలు కూడా కన్సార్షియంగా ఏర్పడి పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇవన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలోకి వచ్చేవి కాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం అప్పులు, పెరిగిన పన్నుల వాటా, తగ్గిన ప్రాయోజిత పథకాలు, సొంత పన్నులు, పన్నేతర ఆదా యం.. అన్నీ లెక్కలేసుకుంటే రూ. 96 వేల కోట్లకు చేరుతుందని, మరో రూ.19 వేల కోట్లు ఎలా వస్తాయనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసిందని కేసీఆర్ వివరించారు. గతంలో ప్రభుత్వాలు రికవరీ చేయలేకపోయిన కమర్షియల్ ట్యాక్స్ రూ. 4 వేల కోట్లు ఉందని, సుప్రీం కోర్టులో మంచి న్యాయవాదులను ఆశ్రయించి పన్ను బకాయిలను రికవరీ చేస్తామని చెప్పారు.
అలాగే హైదరాబాద్‌లో 10 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. రాజధానిలో ‘రియల్’ భూమ్ ఇంకా పుంజుకుంటుందని, రిసోర్స్ మ్యాపింగ్ చేసి.. అన్యాక్రాంతమయ్యే భూములను అమ్మకానికి పెడతామన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు గొంతెత్తడంతో.. ‘పక్కాగా అమ్మి తీరుతాం. ఇది మీరు చూపించిన దారి కాదా?’ అని సీఎం బదులిచ్చారు.