కేటీఆర్ బాస్.. కేసీఆర్ బిగ్‌బాస్: సుమన్
అసెంబ్లీ ఆవరణలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. తనకు కేటీఆర్ బాస్ అయితే, సీఎం కేసీఆర్ బిగ్‌బాస్ అని సుమన్ అన్నారు. హరీశ్‌రావు కాదా అని రేవంత్ ప్రశ్నించగా.. తనకు హరీశ్ కూడా బాసేనని సుమన్ బదులిచ్చారు. ఇదేదో కండిషన్స్ అప్లై అన్నట్లుగా ఉందని రేవంత్ చమత్కరించారు. సుమన్‌పై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసు ఏమైందని రేవంత్‌ను విలేకరులు ప్రశ్నిచంగా, సుమన్ మేనేజ్ చేసుంటారని సమాధానమిచ్చారు.
వెంటనే కల్పించుకున్న సుమన్ ‘ఈ రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నది రేవంత్‌కే అనే విషయం అందరికీ తెలుసు’ అంటూ జవాబిచ్చారు. ఇప్పుడు కేసీఆర్‌కు జానారెడ్డే కాకుండా రేవంత్ కూడా మిత్రుడయ్యారని విలేకరులు వ్యాఖ్యానించడంతో ‘ఇప్పుడు మేం మిత్రుల య్యాం.. ఇక మీ సంగతి చెబుతాం’ అని రేవంత్ సరదాగా వ్యాఖ్యానించారు.