మల్లయ్యకు ఇల్లు మంజూరు | CM kcr sanctioned house to Panikara mallaiah | Sakshi
Sakshi News home page

మల్లయ్యకు ఇల్లు మంజూరు

Published Sun, Jan 11 2015 1:59 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

మల్లయ్యకు ఇల్లు మంజూరు - Sakshi

మల్లయ్యకు ఇల్లు మంజూరు

* ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల సాయం
* మల్లయ్యను పిలిపించి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్
* తెలంగాణపై 2008లో బాబును నిలదీసిన మల్లయ్య

 
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని అమాయకంగా ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించిన ఫణికర మల్లయ్యకు సీఎం కేసీఆర్ ఇల్లు మంజూరు చేశారు. ఫణికర మల్లయ్య ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శనివారం తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా తాను బస చేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి మల్లయ్యను పిలిపించుకున్నారు. మల్లయ్య తన వద్దకు రాగానే  ‘బాగున్నావా మల్లయ్య..’ అని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి  పిల్లల చదువు, ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. మల్లయ్యకు పక్కా ఇల్లు మంజూరు చేశారు. ఆయన ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. సంక్రాంతి తర్వాత మల్లయ్యను హైదరాబాద్‌కు తీసుకురావాలని అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డికి సూచించారు.
 
 వరంగల్ జిల్లా రాయపర్తి మల్లయ్య సొంత ఊరు. 2008లో చంద్రబాబునాయుడు మీ కోసం యాత్ర సందర్భంగా వరి కల్లంలో కూలీ పని చేస్తున్న మల్లయ్య దగ్గరికి వెళ్లాడు. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతూ... ఇంకా ఏం కావాలని మల్లయ్యను అడిగితే తెలంగాణ కావాలని అన్నారు. దాంతో చంద్రబాబు నోట మాట రాక అక్కడి నుంచి మౌనంగా జారుకున్నారు.  ఈ సంఘటనతో ఫణికర మల్లయ్య తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్... స్వయంగా తనతో మాట్లాడడం సంతోషంగా ఉందని మల్లయ్య చెప్పారు. తన రెండో కూతురు రేణుక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోందని, మూడో కూతురు పదో తరగతి చదువుతోందని చెప్పారు. రెండో కూతురుకు ఉద్యోగం ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు మల్లయ్య చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement