అక్కడ మాత్రమే యాక్టివ్‌ కేసులు | CM KCR Says Coronavirus Active Cases Only At 4 Zones In Hyderabad | Sakshi
Sakshi News home page

అక్కడ మాత్రమే యాక్టివ్‌ కేసులు

Published Fri, May 15 2020 11:14 PM | Last Updated on Sat, May 16 2020 10:26 AM

CM KCR Says Coronavirus Active Cases Only At 4 Zones In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తా మని చెప్పారు. ‘కేంద్రం విధించిన తాజా లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 17తో ముగు స్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేస్తాం’అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్నచర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
(చదవండి: తెలంగాణ: కరోనా బారిన మరో 40 మంది)

‘రాష్ట్రంలో కరోనా వైరస్‌ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమైంది. ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు కొందరికి వైరస్‌ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్‌ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు పరి గణించడానికి లేదు. పాజిటివ్‌ కేసులున్న నాలుగు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం’అని సీఎం వెల్లడించారు. 
(చదవండి: 79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..)

భయం వద్దు..
‘కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్‌ సోకినా ఎక్కువ మంది కోలుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్‌ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు’అని కేసీఆర్‌ చెప్పారు.

పరిశుభ్రంగా ఉంచాలి..
‘సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నెలకు 5 సార్లు సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయాలి. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్‌ నెలలో ఐదు సార్లు పిచికారి చేయాలి. చెత్తా చెదారం తొలగించాలి. దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్‌ చేయాలి. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉండటానికి దోహదపడుతుంది. 

పట్టణాల్లో మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వారి వారి పరిధిలో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వ యంత్రాంగంతో పని చేయించాలి. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలి’అని సీఎం సూచించారు.

నిధుల కొరత లేకుండా..
‘లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించిన నిధులను విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశాం. జూన్‌కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’అని సీఎం చెప్పారు.

మరో 45 బస్తీ దవాఖానాలు 
హైదరాబాద్‌ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందర్‌రావు, పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేశ్‌ భగవత్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏసీలు, ఆటోమొబైల్‌ షోరూమ్‌లు.. షాపులకు అనుమతి
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శని వారం నుంచి ఏసీలు అమ్మే షాపులు, ఆటోమొబైల్‌ షోరూమ్స్, ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, ఆర్టీఏ ఆఫీసులు నడుస్తాయి. మిగతా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతాయి. విదే శాలు/ఇతర రాష్ట్రాల నుంచి విమా నాలు/రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా హైదరాబాద్‌ చేరు కునే తెలంగాణవాసులకు పరీక్షలు నిర్వ హించాలి. వైరస్‌ ఉంటే ఆస్పత్రికి తర లించాలి. లేకుంటే హోం క్వారంటైన్‌లో ఉంచాలి. హైదరాబాద్‌లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానా శ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా సొంత రాష్ట్రాలకు పంపాలి’ అని కేసీఆర్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement