సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగమేనని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.82 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. మంగళవారం ఈ మేరకు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇలాంటి సమయంలో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి రొడ్డకొట్టుడు ఆరోపణలు చేయటం సరికాదు’అని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ సభా సంప్రదాయాలను కాపాడాలని అన్నారు. కేంద్రంతోపాటు, 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ట్రాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ‘మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. జపాన్ జీడీపీ కంటే 250% ఎక్కువ అప్పులే ఉన్నాయి. అంత మాత్రాన జపాన్ వాళ్లు తెలివి తక్కువ వాళ్లా? అప్పులు తీసుకోవడం బుద్ధి తక్కువ ఆలోచన కాదు’అని పేర్కొన్నారు.
దేశ జీడీపీలో 49.5 శాతం అప్పులే
‘దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు. దేశం అప్పులు రూ.82 లక్షల కోట్లు. అంటే 49.5 శాతం మేర కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ ఏడాది కేంద్రం చెల్లిస్తున్న అప్పులు రూ.8.76 లక్షల కోట్లు. గత మూడేళ్లలో అంటే 2016–2017లో రూ.5,35,618 కోట్లు, 2017–18లో రూ.5,94,849 కోట్లు, 2018–19లో రూ.6,24,276 కోట్ల అప్పులను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన గణాంకాలివి. తెలంగాణ జీఎస్‌డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయి. ఉదయం పథకం కింద రూ.9 కోట్ల అప్పు వచ్చింది’అని సీఎం వివరించారు. ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పనీ చేయలేదా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఆసరా పెన్షన్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని నిలదీశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తోందని సభకు గుర్తు చేశారు.
మూడు రోజుల్లో రుణమాఫీ వడ్డీలు చెల్లిస్తాం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని, ఇంత గొప్పగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు పీఆర్‌సీని కూడా కచ్చితంగా వెస్తామని, దానికి కొంత సమయం ఉందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేశామని, ఎక్కడైనా రైతు రుణాల వడ్డీ మాఫీ కాకుండా మిగిలిపోతే.. వారి వివరాలను ఇస్తే మూడు, నాలుగు రోజుల్లో ఆ డబ్బును చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment