డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జరుగు తున్న అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం సృష్టిస్తోంది. ‘డబుల్’ఇళ్ల అక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై 48 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌ను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, పలువురు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో వణుకు మొదలైంది.
హుటాహుటిన రంగంలోకి..
సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుక్షణమే ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో విచారణ ప్రారంభించాయి. ఈ జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లెన్ని, ఎంత మందికి కేటాయింపులు చేశారు, ఏవిధంగా కేటాయింపులు జరిపారన్న అంశాలపై రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చిన జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై విచారణ జరిపేందుకు డీఎస్పీ ర్యాంకు అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం నియమించింది.
నాలుగు అంశాలపై ప్రధాన విచారణ
డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారంలో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. లాటరీ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా కేటాయింపులు ఎక్కడెక్కడ చేశారు, ఈ విధమైన కేటాయింపులను ప్రోత్సహించిన ఎమ్మెల్యేలెవరు, వారి అనుచరులెవరు, ప్రభుత్వ భూమి లేనిచోట, ప్రైవేట్ భూములను ఏ విధంగా కొనుగోలు చేశారు, అవి ఎంత మంది చేతులు మారాయి? అన్న అంశాలపై విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది.
పలువురు ఎమ్మెల్యేల్లో వణుకు!
ఇళ్ల కేటాయింపులు జరపడం రెవెన్యూ విభాగం పనే అయినా.. లాటరీ పద్ధతి కాకుండా దళారుల మధ్యవర్తిత్వం, అనుచరుల ఒత్తిడితో కేటాయింపులు చేసిన అధికార çపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల్లో వణుకు మొదలైంది. భారీగా డబ్బులు దండుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించిన వ్యవహారంపై క్రిమినల్ కేసులకు కూడా వెళ్లేందుకు అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రెవెన్యూ విభాగం తరఫున కేటాయింపుల్లో పాత్రధారులుగా ఉన్న ఎమ్మార్వోలకు కూడా సస్పెన్షన్ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది.
సెలవుపై ఎమ్మార్వో..
ఉన్నతాధికారులు భద్రాచలంలో ఇళ్ల కేటాయింపు అక్రమాలకు సంబంధించి అక్కడి ఎమ్మార్వోను దీర్ఘకాలిక సెలవులో పంపించినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం సబ్ కలెక్టర్‌ను ఈ వ్యవహారంపై విచారణాధికారిగా నియమించినట్టు అక్కడి కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇక పలు జిల్లాల్లో డబుల్ ఇళ్ల అక్రమాలకు సంబంధించి కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి.
10 మంది అనర్హుల గుర్తింపు
భద్రాచలం : భద్రాచలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో 10 మంది అనర్హులను అధికారులు గుర్తించారు. డబుల్ ఇళ్ల అవకతవకలపై ‘సాక్షి’ ప్రచురితమైన కథనంతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ స్పందించి.. భద్రాచలంలో ఇళ్ల కేటాయింపుపై సమగ్ర వివరాలను తెప్పించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. 10 మంది అనర్హులను గుర్తించామని, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని సబ్‌కలెక్టర్ పమెలా సత్పత్తి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment