సారొస్తున్నారు.. | CM KCR Visit Kaleswaram Project In Warangal | Sakshi
Sakshi News home page

సారొస్తున్నారు..

Published Sun, May 19 2019 10:51 AM | Last Updated on Sun, May 19 2019 10:51 AM

CM KCR Visit Kaleswaram Project In Warangal - Sakshi

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తి చేసి ఖరీఫ్‌లో సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూన్, జూలై నెలలో రాష్ట్రంలోని 37.6 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులు, నిర్మాణ సంస్థలను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అటు అధికారులు.. ఇటు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేసేలా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం వస్తున్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : అధికారులు వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 6.40 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అంటే సుమారు 7 గంటల పాటు మేడిగడ్డ బ్యారేజీ వద్దే గడపనున్నారు. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పనులు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కాల్వ నిర్మాణాలను పరిశీలించి ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. తద్వారా సీఎం పర్యటన మొత్తం మేడిగడ్డ బ్యారేజీ పనులే లక్ష్యంగా సాగనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌజ్, అన్నారం ప్రాజెక్ట్, గ్రావిటీ కెనాల్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే, మేడిగడ్డ బ్యారేజ్‌ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఈ మేరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తి చేసి ఖరీఫ్‌లో సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రభుత్వం.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు – 2 కింద వరకు సుమారు 13 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచి నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

గతంలో కూడా మేడిగడ్డపైనే దృష్టి
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఏడాది జనవరి 1న కాళేశ్వరానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్, గ్రావిటీ కెనాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మార్చి చివరిలోగా మేడిగడ్డ, గ్రావిటీ కెనాల్‌ను పూర్తి చేసి ఖరీఫ్‌ నాటికి సాగు నీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా గ్రావిటీ కెనాల్‌ పనులు దాదాపుగా పూర్తయినా మేడిగడ్డ పనులకు మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ కూడా పలుమార్లు మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లను సందర్శించారు. ఈక్రమంలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్‌ పనులపై అసంతప్తి వ్యక్తం చేసిన ఆమె.. నివేదికలను సీఎంకు సమర్పించినట్లు తెలిసింది.
 
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఆదివారం రానున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహస్, కాళేశ్వరాలయాలను భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, ఇంటిలిజెన్స్‌ ఐజీ నవీన్‌ చంద్‌ వేర్వేరుగా పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు అందజేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట  భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక హెలీప్యాడ్లను ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్స్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌ బృందాలు పంపుహౌస్, హెలిప్యాడ్‌ వద్ద తనిఖీలు చేపట్టాయి. కాగా, సీఎం పర్యటన నేపద్యంలో కాళేశ్వరం ఆలయంతో పాటు కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల వద్ద సుమారు 1000మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంబింగ్‌ బృందాలు గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. కాగా, ముగ్గురు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 20 మంది సీఐలు, 80 మంది ఎస్సైల నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ.. మేడిగడ్డ బ్యారేజీ
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు వంటిది మేడిగడ్డ బ్యారేజీ. రూ.2,930 కోట్ల వ్యయంతో 1,632మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ బ్యారేజీలో ఇప్పటి వరకు రూ. 2,590కోట్ల విలువైన పని జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే 85 గేట్లలో 78 గేట్లు బిగించగా మిగిలినవి ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ బ్యారేజీ నీటి సామర్ధ్యం 16.7 టీఎంసీలు. బ్యారేజీకి కుడివైపున 6.5 కిలోమీటర్లకు 6.3 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం జరిగింది. మహరాష్ట్ర వైపు 11.5 కిలోమీటర్లకు 10.5 కిలోమీటర్లు నిర్మాణం జరిగింది. తెలంగాణ, మహారాష్ట్రను కలిపె వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. సైడ్‌ వాల్స్‌ నిర్మాణం జరగాల్సి ఉంది.

కన్నెపల్లి పంపుహౌస్‌
కాళేశ్వరం ప్రాజెక్టులోనే కన్నెపల్లి(మేడిగడ్డ) పంపుహౌస్‌ గుండె కాయ వంటిది. రూ.3వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రూ.2200 కోట్ల మేరకు పనులు జరిగాయి. నేరుగా గోదావరిలో మేడిగడ్డ బ్యారేజీ ద్వారా నిలిచిన బ్యాక్‌ వాటర్‌ నీటిని అప్రోచ్‌కెనాల్, ఫోర్‌బే, హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలిస్తారు. ఇలా తరలించిన నీటిని పంపుహౌస్‌ అమర్చిన 11 శక్తివంతమైన మోటార్ల గుండా డెలివరీ సిస్టర్స్‌ ద్వారా గ్రావిటీ కాల్వలోకి చేరుతుంది. ఆ తర్వాత అన్నారం బ్యారేజీకి నీరు వెళ్తుంది. ఇందులో 11 మోటార్లకు 8 మోటార్లు బిగించారు. ఇక 9, 10వ మోటార్ల బిగింపు పనులు పురోగతిలో ఉన్నాయి. జూన్‌ మొదటి వారంలోగా మొత్తం మోటార్లు బిగించనున్నారు. గ్రావిటీ కాల్వకు నీరు తరలించడానికి 22 పైప్‌లైన్ల నిర్మాణం జరగగా భవిష్యత్‌లో 3టీఎంసీల నీటిని తరలించడానికి అనుగుణంగా 17మోటార్లకు కావాల్సినన పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయింది. మొత్తంగా 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.

తుదిదశలో గ్రావిటీ కెనాల్‌
రూ.800 కోట్ల వ్యయంతో గ్రావిటీ కాల్వ నిర్మాణం జరుగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.40కిలోమీటర్ల వరకు నిర్మాణం పూర్తయింది. లైనింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇక 30 స్ట్రక్చర్ల నిర్మాణాల్లో 29 వరకు పూర్తయ్యాయి. నీటిని తరలించడానికి గ్రావిటీ కాల్వ సిద్ధంగా ఉంది. మిగిలిన సూపర్‌ స్పాజ్, అండర్‌ టన్నల్‌ వంటి పనులన్నీ తుది దశకు చేరాయి. గ్రావిటీ కాల్వ వెంట 13.40 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

అన్నారం బ్యారేజీ
అన్నారం బ్యారేజీని రూ.2,140 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ పనులు అన్నింటికన్నా ముందుగా జనవరిలోనే పూర్తయ్యాయి. ఇందులో 66 గేట్లు బిగించారు. గేట్ల నిర్వహణకు కోసం ఎలక్ట్రికల్‌ రూం నిర్మిస్తున్నారు. నీటిసామర్ధ్యం 11 టీఎంసీలు. అన్నారం, సుందరశాల వైపున ఇరువైపులా కరకట్టల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. బ్యారేజీపైన నిర్మించిన వంతెనపై రాకపోకలు అనధికారికంగా కొనసాగుతున్నాయి.

ఇప్పట్లో వెట్‌రన్‌ లేనట్లే..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రస్తుతం వివిధ ప్యాకేజీల్లోని పంప్‌హౌజ్‌ల వద్ద ప్రభుత్వం వెట్‌రన్‌ నిర్వహిస్తోంది. కన్నెపల్లిలో కూడా వెట్‌రన్‌ కోసం కావాల్సిన అన్ని పనులు పూర్తయినా నీటి లభ్యత విషయమే కీలకంగా మారింది. ఇప్పటికే గోదావరి నది నుంచి పంప్‌హౌజ్‌ వరకు అప్రోచ్‌ కెనాల్‌ పనులు పూర్తయ్యాయి. ఈనెల 7, 15వ తేదీల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని మోటర్ల ద్వారా వెట్‌రన్‌ నిర్వహిస్తారని భావించినా నీటి లభ్యత లేని కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ దగ్గర గోదావరికి అడ్డంగా కాపర్‌డ్యాం నిర్మించి పంప్‌హౌజ్‌కు నీటిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాపర్‌ డ్యాం వద్ద 93.5 మీటర్ల నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రవాహం అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో వెట్‌రన్‌ నిర్వహించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement