అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు,కలెక్టర్లు.. సీఎంకు మొక్కను అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ సహా వివిధ ప్రాంతాలను బుధవారం సీఎం కేసీఆర్‌తో పాటు, పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శించారు. ముందుగా వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. సహజ అడవుల పునరుత్పత్తి విధానం ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై సీఎం స్వయంగా మంత్రులు, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. ‘అడివంటే గిట్లుండాలె.. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి’ అని సూచించారు. గజ్వేల్‌లో హరితహారం కార్యక్రమాలను బస్సులో నుంచి చూపించారు. కోమటిబండగుట్టపై ‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ ప్రాంతంలో మంత్రులు, కలెక్టర్లతో కలియతిరిగి పథకం అమలు తీరును వివరించారు. మంత్రులు, కలెక్టర్లు ఆద్యంతం సీఎం వెంట ఉత్సాహంగా తిరిగారు. సీఎంతోపాటు జిల్లా అధికారులు చెప్పినవి వారంతా ఆసక్తిగావిన్నారు.
– సాక్షి, సిద్దిపేట/గజ్వేల్
సాక్షి, సిద్దిపేట: ప్రతీ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో కలిసి తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన అడవుల పునరుద్ధరణ, సామూహిక అడవుల పెంపకం, మిషన్ భగీరథ పనులను కలెక్టర్లు, మంత్రులకు వివరించారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు సింగాయపల్లి, మెంటూరు, గజ్వేల్ షరీఫ్, కోమటిబండ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మూడు సంవత్సరాల్లో అడవులను పెంచిన తీరును అధికారులకు వివరించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ జిల్లాలో అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.
మొక్కల గురించి వివరణ
హైదరాబాద్ నుంచి ప్రగతి వాహనంలో బయలు దేరిన కేసీఆర్, ఆయన వెంట అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు కలిసి వర్గల్ మండలంలో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న సింగాయపల్లి అడవి వద్ద వాహనాలు ఆపేశారు. మూడు సంవత్సరాల క్రితం మొక్కలు లేకుండా బోసిపోయిన అడవి ఇప్పుడు పచ్చగా ఉందని కలెక్టర్లకు కేసీర్ వివరించారు. అక్కడే ఉన్న మొక్కలను కలెక్టర్లకు చూపిస్తూ.. ఈ మొక్క మూడు సంవత్సరాల క్రితం నాటిందని ఇప్పుడు ఏపుగా పెరిగి వృక్షంగా మారిందని, ఈ మొక్కకు ఢోకాలేదని చెబుతుంటే కలెక్టర్లు ఆశ్చర్యంగా చూశారు. అదే విధంగా అడవి భూముల్లో మొక్కలు పెంచడం సులభంతో పాటు, డబ్బులు కూడా తక్కువ ఖర్చు అవుతాయని చెప్పి మీరు ఇలాగే.. అడవులు పెంచాలని తెలిపారు.
మిషన్ భగీరథ స్ఫూర్తి..
రాష్ట్ర ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రవేశపెట్టినది మిషన్ భగీరథ పథకం. రాష్ట్రంలోనే త్వరగా పూర్తి చేసుకున్న కోమటిబండ ప్లాంట్, పంపింగ్ సిస్టమ్‌ను కలెక్టర్లకు సీఎం చూపించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఒక పక్క కోమటిబండ మిషన్ భగీరథ ప్లాంట్, మూడు వైపులా అటవీ ప్రాంతం మధ్యలో వేసిన టెంట్ల కింద కలెక్టర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పథకంలో మనం దేశానికే ఆదర్శంగా నిలిచాం అని చెబుతూనే హరిత జిల్లాల ఏర్పాటుకు కూడా ఇక్కడి నుంచే నాంది పలకాలని సూచించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఫారెస్టు అధికారులు చేసిన ప్రయత్నంలో భాగమే ఈ పచ్చటి అడవి అన్నారు. ఇలాగే మీరు కూడా మీ జిల్లాలో అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అడవుల్లో కోతులు, జంతువులు, పండ్లు ఫలాలు, ఇతర వనమూలిక వృక్షాలు ఇలా ఒకొక్క దాని గురించి కేసీఆర్ వివరిస్తూ కలెక్టర్లకు అటవీ పెంపకంపై పాఠాలు చెప్పిన విధంగా అన్ని విషయాలను కూలంకషంగా వివరించారు.
ఉత్సాహంగా కలెక్టర్లు..
రోజువారి పని ఒత్తిడితో ఉండే కలెక్టర్లు బుధవారం కోమటిబండ వద్ద ఉత్సాహంగా కన్పించారు. అడవి, చెట్లు, చేమల మధ్య తిరిగి వాటిని పరిశీలించారు. చెట్లను పెంచిన తీరుపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా అడవి మధ్యలో సీఎం సమీక్ష నిర్వహించడంతో కార్యక్రమం ప్రత్యేకతను చాటుకుంది. సెల్ ఫోన్ చప్పుడు, వాహనాల కాలుష్యం లేకుండా ఈరోజు గడిపి నందుకు ఆనందంగా ఉందని పలువురు కలెక్టర్లు సహచరులతో చర్చించుకున్నారు.
సమస్యలు తెలపాలని..
సీఎం కేసీఆర్, మంత్రులు, కలెక్టర్లతో కలిసి తమ ప్రాంతానికి వస్తున్నారు. సార్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని కొందరు. సార్‌ను కలిసి పోవాలని కొందరు రాజకీయ నాయకులు, ప్రెస్, మీడియా హడావుడి అంతా కాసేపట్లోనే నీరుగారి పోయింది. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కరిద్దరు నాయకులు మినహా ఎవ్వరిని కూడా వారి దరిదాపుల్లోకి రానివ్వకపోవడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి, కలెక్టర్ల సమీక్షా సమావేశానికి కిలోమీటర్ల దూరంలోనే అందరూ ఉండిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్య సభ సభ్యుడు సంతోష్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కలెక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment