ప్రాజెక్ట్ వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న సిబ్బంది
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రాజెక్ట్ వద్ద పార్కు నిర్వాహకుల దోపిడిని చూసి శ్రీరామా.. ఇదేమీ దోపిడి అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సందర్శనకు రావాలంటే జంకుతున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధిలో భాగంగా గత నాలుగేళ్ల క్రితం 6 కోట్ల నిధులతో పార్కు నిర్మించారు. పార్కు నిర్వహణనను యువజన సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకుల వద్ద పార్కింగ్ వసూలు కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పార్కు నిర్వహణ చేపడుతూ.. పార్కు సందర్శనకు వచ్చే పర్యాటకుల వద్ద నిర్ణయంచిన రుసుం ప్రకారం టికెట్ తీసుకోవాలి. కాని ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న ప్రతి పర్యాటకుని వద్ద వాహనాలకు పార్కింగ్ ఫీజు పేరిట ద్విచక్ర వాహనానికి 10 రూపాయాలు, కారులకు 20 రూపాయాల చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
స్థానికులనూ వదలడం లేదు...
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నుంచే సోన్‌పేట్ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా లెఫ్ట్ పోచంపాడ్ వాసులు ఎస్సారెస్పీ డ్యాం పై నుంచే వెళ్లాలి. వాళ్లను కూడా వదలకుండా టోల్ వసూలుకు పాల్పడుతున్నారు. ఫలాన గ్రామం అని చెప్పినా వినకుండా వాహనాలను ఆపుతున్నారు. గ్రామ నివాసి అని గుర్తింపు కార్డు చూపాలంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదే దోపిడి దానికి గుర్తింపు కార్డులు చూపాలనడం విడ్డూరంగా ఉందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఫోటోలకూ ఫీజు వసూలు..!
పార్కు ఎంట్రీ ఫీజుకు తోడు పార్కులో ఫోటోలు దిగాలంటే నిర్వహకులకు 350 రూపాయాల నుంచి 500 రూపాయాలు సమర్పించుకుంటేనే ఫోటోలు దిగే అవకాశం ఇస్తారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వారికి అండగా ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దోపిడిని అరికట్టాలని పర్యాటకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నోటీసులు అందించాం: శ్రీనివాస్‌రెడ్డి,ఎస్‌ఈ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పార్కులో వసూళ్లకు పాల్పడుతున్నారని దృష్టికి రావడంతో నిర్వహకులకు నోటీసులను జారీ చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment