
వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా కలెక్టర్ల ప్రతిజ్ఞ
అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన వివిధ జిల్లాల కలెక్టర్లతో గజ్వేల్ ఆదివారం కళకళలాడింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నవ్వుతూ..ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పనులకు తన సహచరులకు వివరించారు. పర్యటన అనంతరం ఇక్కడ అమలవుతున్న హరితహారం పనులను తాము ఆదర్శంగా తీసుకుంటామని బృందం సభ్యులు ప్రకటించారు. ఎడ్యుకేషన్ హబ్ అద్భుతమని కొనియాడారు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న అభివృద్ధి తీరుపైఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గజ్వేల్: సీఎం ఇలాకా గజ్వేల్‌లో సాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించేదుకు వచ్చిన కలెక్టర్లతో గజ్వేల్ కళకళలాడింది. పర్యటన అనంతరం మా జిల్లాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతాం అంటూ జిల్లా కలెక్టర్ల బృందం ప్రకటించింది. నియోజకవర్గంలో చేపట్టిన అటవీ సహజ పునరుద్ధరణ(ఏఎన్‌ఆర్), కృత్రిమ పునరుద్ధరణ(ఏఆర్)తీరుపై రాష్ట్రంలోని రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు మినహా మిగతా వారంతా బస్సులో యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, హరితహారం ఓఎస్‌డీ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సీసీఎఫ్ ఏకే సిన్హాలతో కలిసి కలెక్టర్ల బృందం ఇక్కడ పర్యటించింది. హైద్రాబాద్‌లో శనివారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న హరితహారం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది.
ముందుగా ‘హారితహారం’..
మొదట ములుగు మండలం నర్సంపల్లిలో ఏఎన్‌ఆర్(యాడెడ్ నేచురల్ రీ–జనరేషన్), ఏఆర్(ఆర్టిఫిషియల్ రీ–జనరేషన్)బ్లాక్‌లను వారు పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ రేంజ్ పరిధిలో 439 హెక్టార్లలో ఏఎన్‌ఆర్, 370హెక్టార్లలో ఏఆర్ విధానంలో మొక్కల పెంపకం జరిగిందని పీసీసీఎఫ్ పీకే ఝా కలెక్టర్లకు వివరించారు. 2015–16లో 70 లక్షల మొక్కలు, 2016–17లో కోటి 21లక్షల మొక్కలు, 2017–18లో కోటి 57లక్షల మొక్కలు ఉద్యమస్థాయిలో నాటినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ల బృందం గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్‌భగీరథ’ హెడ్‌వర్క్స్ ప్రాంతం నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్లు ఈఈ రాజయ్యను అడిగి తెలుసుకున్నారు.
దేశంలోనే నం.1 గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌వివరించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
అనంతరం గజ్వేల్‌లో బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించారు. 3వేల మంది బాలురు, 2500మంది బాలికలకు విద్యను అందిస్తూ.. హాస్టల్‌తో పాటు అన్ని రకాల వసతులు కల్పించిన తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. ఇలాంటి హబ్ దేశంలో ఎక్కడా లేదని.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కలెక్టర్ల బృందానికి వివరించారు. రూ. 153కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో ఈ హబ్‌ను నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా పేదల కోసం నిర్మించిన 1250 ‘డబుల్ బెడ్‌రూమ్ మోడల్ కాలనీని కలెక్టర్ల బృందం పరిశీలించింది. 156 బ్లాకులుగా ఒక్కో బ్లాకులో 8 ఇళ్ల చొప్పున కాలనీని నిర్మించామని, కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీళ్లు, పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్‌హాల్ వంటి వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు.
కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏసీ, ఇతర అధునాతన వసతులతో చేపట్టిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి బృందానికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..గజ్వేల్‌లో అమలవుతున్న హరితహారం తో పాటు వినూత్న పద్ధతుల్లో జరిగిన అభివృద్ధిని అధ్యయనం చేయడానికి కలెక్టర్ల బృందం రావడం హర్షణీయమన్నారు. పర్యటన ద్వారా మిగతా జిల్లాల్లో సైతం ఇదే తరహాలో అభివృద్ధికి బాటలు పడే అవకాశముందన్నారు.
పాత టీంను పలకరించిన రోనాల్డ్
ప్రస్తుత మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులను పేరు పెట్టి పిలుస్తూ ఆకట్టుకున్నారు. లంచ్‌కు వెళ్ళే సమయంలో రోనాల్డ్‌రోస్ ములుగు మండలంలోని అటవీ అతిథిగృహానికి తన వాహనంపై నుంచి డ్రైవర్‌ను దింపేసి సెల్ఫ్ డ్రైవింగ్ చేశారు. కలెక్టర్లంతా బస్సులో ప్రయాణించగా...‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ వద్ద రోనాల్డ్‌రోస్ ఇలా సెల్ఫ్ డ్రైవింగ్‌తో వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది.
గజ్వేల్‌అభివృద్ధి అదుర్స్..
గజ్వేల్ డెవలప్‌మెంట్ ఎక్సలెంట్. హరితహారం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టారు. మా జిల్లాలో కూడా హరితహారంలో ముందంజలో ఉన్నాం. అభివృద్ధి పనుల తీరు బాగుంది. గజ్వేల్ విజిట్ సంతోషంగా ఉంది.– ఆమ్రపాలి, వరంగల్ అర్బన్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment