వీరుడా.. వీడ్కోలు | Colonel Santosh Babu Funeral Completed In Suryapet District | Sakshi
Sakshi News home page

వీరుడా.. వీడ్కోలు

Published Fri, Jun 19 2020 1:48 AM | Last Updated on Fri, Jun 19 2020 12:03 PM

Colonel Santosh Babu Funeral Completed In Suryapet District - Sakshi

గురువారం సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌ బాబు అంతిమ యాత్రలో సైనిక వాహనంపై పూలు జల్లుతూ నివాళులర్పిస్తున్న ప్రజానీకం..

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు జనం అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ‘జై జవాన్, వందేమాతరం, భారత్‌ మాతాకీ జై, చైనా ఖబడ్దార్‌’ అంటూ పెద్దపెట్టున నినదిస్తూ, జాతీయ పతాకాలు చేతబట్టి అంతిమయాత్రలో కదిలారు. ‘వీరుడా నీ త్యాగం ఎప్పటికీ మరువం’అంటూ సూర్యాపేట పట్టణమంతా గొంతెత్తి స్మరించుకుంది. గురువారం ఉదయం 9.40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై పట్టణ సమీపంలోని కేసారం గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి 11.30 గంటలకు చేరుకుంది. 5.5 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర జనసంద్రమైంది. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజలు, ప్రభుత్వ ప్రముఖుల అశ్రునయనాలు, బాధాతప్తహృదయాల మధ్య సంతోష్‌బాబు అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో చేపట్టారు. బిహార్‌ రెజిమెంట్‌ 1వ బెటాలియన్‌ సైనికులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలు ముగిశాయి.

భర్త పార్థివదేహానికి కుమారుడు అనిరుద్‌తో కలిసి సెల్యూట్‌ చేస్తున్న సంతోషి 

కడచూపు వేళ జనమంతా కన్నీటిపర్యంతం 
బుధవారం రాత్రి 11.40కి కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే అమర జవానుకు నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కల్నల్‌ను కడసారి చూసేందుకు మరింత పెద్దసంఖ్యలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ.. నివాళులర్పించారు. సంతోష్‌బాబు పార్థివదేహాన్ని ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉంచారు. సైనిక లాంఛనాలతో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితో పాటు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 10 నిమిషాల పాటు పార్థివదేహానికి గౌరవ వందనం సమర్పించారు. 9.40 గంటలకు బిహార్‌ రెజిమెంట్‌ ఫస్ట్‌ బెటాలియన్‌కు చెందిన పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్‌ నుంచి కేసారంలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలోని అంత్యక్రియల ప్రాంగణం వరకు ఉన్న 5.5 కిలోమీటర్ల దూరానికి చేరుకునేందుకు 2 గంటలు పట్టింది. 11.30 గంటలకు అంతిమయాత్ర వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. దారిపొడవునా ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది కల్నల్‌ పార్థివదేహం ఉన్న వాహనంపై పూలవర్షం కురిపించారు. జాతీయ పతాకాలతో, జైహింద్‌ నినాదాలతో ముందు నడిచారు. కల్నల్‌ సంతోష్‌బాబు చితికి మధ్యాహ్నం 12.05 గంటలకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, కుమారుడు అనిరుధ్‌ కలిసి నిప్పంటించారు. భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల కడచూపు వేళ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబసభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కూతురు అభిజ్ఞ తండ్రి చితిలో కట్టె వేయగానే.. ‘అయ్యో బిడ్డా’అంటూ కుటుంబసభ్యులు విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.

 సంతోష్‌బాబు భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేస్తున్న ఆర్మీ అధికారులు, జవాన్లు  

బిహార్‌ రెజిమెంట్‌ ఆధ్వర్యంలో.. 
సంతోష్‌బాబు 2004లో బిహార్‌ 16వ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఫస్ట్‌ బెటాలియన్‌ అంత్యక్రియల్ని చేపట్టింది. ఈ బెటాలియన్‌కు చెందిన 50 మంది జవాన్లు, పదిమంది మేజర్, కల్నల్, కెప్టెన్‌ ర్యాంకు అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్య అధికారులుగా 54 బెటాలియన్‌ బ్రిగే డియర్‌ అగర్వాల్, మేజర్‌ ఫరీద్, కల్నల్స్‌ విజయ్, అభినవ్, జాద వ్, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్స్‌ శ్రీనివాసరావు, మథి, ప్రత్యేక అధికారి దినేష్‌కుమార్‌ హాజరయ్యారు. 12 గంటలకు మూడురౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలను పూర్తిచేశారు. అంతకుముందు సంతోష్‌బాబు ఆర్మీడ్రెస్, క్యాప్, జాతీయ పతాకాన్ని ఆయన సతీమణి సంతోషికి ఆర్మీ అధికారి అందించారు.

గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పిస్తున్న జవాన్లు 

ప్రముఖుల శ్రద్ధాంజలి.. 
వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రముఖులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ప్రతినిధిగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం రాత్రి నుంచి అంత్యక్రియలు ముగిసే వరకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, వివేక్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి ఉత్తమ్‌కుమార్, సంకినేని వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మిలటరీ అధికారులు అందజేసిన భర్త ఆర్మీ దుస్తులను గుండెలకు హత్తుకొని కన్నీటిపర్యంతమవుతున్న సంతోష్‌బాబు భార్య సంతోషి  

నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో బడుగుల, బూర నర్సయ్యగౌడ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement