
గ్రేటర్‌లో పాగాకు టీఆర్‌ఎస్ కుయుక్తులు
- ఎంఐఎంతో పొత్తుకు.. గ్రేటర్‌ను ముక్కలు చేసేందుకు ఎత్తులు
- బీజేపీ కార్యవర్గ సమావేశంలో నేతల ధ్వజం
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తాలేక ఎంఐఎంతో జతకట్టి గ్రేటర్‌లో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోందని, ఇందులో భాగంగానే మజ్లిస్‌కు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తోందని బీజేపీ శాసన సభాపక్ష నేత, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసేందుకు పూనుకున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో నగర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్‌షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నగర శాఖ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించి హైదరాబాద్‌ను ఎంఐఎం కైవసం చేసుకునే దశగా ఆ పార్టీ ఎత్తులు వేసిందని విమర్శించారు.
తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రాజముద్రలో చార్మినార్ ఉండేలా చేసిందన్నారు.గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తే మరో 6 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంఐఎం ఆశీస్సుల కోసం మహా నగరాన్ని మూడు ముక్కలు చేయాలని టీఆర్‌ఎస్ ఆతృతగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలవని ఎంఐఎం సాయంతో గ్రేటర్‌లో పాగా వేయాలనే ఉత్సుకత కేసీఆర్‌లో కనపడుతోందని ఎద్దేవా చేశారు.
సర్వేతో నగరం ఖాళీ
రాష్ట్ర పరిధిలో లేని విషయాల్లో సీఎం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆక్షేపించారు. ఈనెల 21న సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ బీజేపీ ఆధ్వర్యంలో స్వాగత సన్మాన సభ, 22న గ్రామ అధ్యక్షులతో ఎల్బీనగర్‌లోని మున్సిపల్ స్టేడియంలో సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్రాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి శ్రీనివాస్, బన్వర్‌లాల్ వర్మ, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.