
మాట్లాడుతున్న దేవి
భద్రాచలం: బీజేపీ పాలనలో మతోన్మాదం పెరుగుతుందని, దీని వల్ల సామాన్యులకు హాని జరిగే ప్రమాదం ఉందని సాంస్కృతిక ఉద్యమ కార్యకర్త దేవి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని అం బేద్కర్ సెంటర్‌లో జరిగిన సెమినార్‌లో ఆమె పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాల్గేళ్ల కాలంలో మతోన్మాదులు పెరిగారని, దీని వల్ల ముస్లిం, మైనార్టీ, ఆదివాసీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిం, దళితులు, ఆదివాసీలపై ఆర్‌ఎస్‌ఎస్ మూకలు తెగబడుతున్నాయన్నారు.
కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, వారి మధ్య ఐక్యతను దెబ్బతీసి రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో కవులు, రచయితలపై దాడులు పెరిగిపోయాయని, భావ స్వేచ్చకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు.
బీజేపీ పాలనలో పౌరహక్కులు, మానవ హక్కుల కంటే జంతు హక్కులే ఎక్కువగా రక్షించబడుతున్నాయని ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజానీకం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
సెమినార్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి, ఏజే రమేష్, మర్లపాటి రేణుక, పద్మ, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, వెంకటరామారావు, లీలావతి, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment