నల్లగొండ : వేతనాలు సవరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. అన్ని డిపోల ఎదుట కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు బైఠాయిం చి నిరసన వ్యక్తం చేశారు. బస్సులు నడిపేందుకు అధికారులు తీసుకున్న చర్యలను సైతం కార్మిక సంఘాలు తిప్పికొట్టాయి. ఈ సమ్మెలో డ్రైవర్లు, కండక్టర్లు కలిపి మూడు వే ల మంది పాల్గొన్నారు. సంఘాలకు మద్దతు గా ఆయా డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సూపర్‌వైజర్లు కూడా విధులు బహిష్కరించారు. దీంతో జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంతో పాటు, అన్ని డిపోల్లో సేవలు స్తంభించిపోయాయి. అయితే ఈ సమ్మెలో క్యాజువల్ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొనడాన్ని ఆర్టీసీ యాజమాన్యం తప్పుపట్టింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆర్‌ఎం బి. రవీందర్ కోరారు.
వెనక్కొచ్చిన బస్సులు...
రీజియన్ పరిధిలో వివిధ మార్గాల్లో 53 అద్దెబస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రవాణా శాఖ కూడా 25 మంది ప్రైవేటు డ్రైవర్లను అందుబాటులో ఉంచారు. కానీ కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో బస్సులు తిరిగి డిపోలకే వచ్చిచేరాయి. నల్లగొండ-దేవరకొండ మార్గంలో వెళ్తున్న బస్సును నల్లగొండ సాగర్ క్రాస్ రోడ్డు వద్ద సంఘాల నాయకులు అడ్డుకుని డ్రైవర్‌ను బెదిరించారు. అదే విధంగా నల్లగొండ డిపో నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా కార్మిక సంఘాలు డిపో ఎదుట బైఠాయించాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లకు పూనుకున్నారు. జిల్లా మీదుగా నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు కాకుండా రీజియన్ పరిధిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచి అన్ని డిపోల్లో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. న ల్లగొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, మిర్యాలగూడ డిపోల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రవాణా శాఖ సహాయంతో లెసైన్సు కలిగిన ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను కూడా తీసుకొస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు సహాయంతో బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేటు వాహనాల దోపిడీ...
వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయ, రాష్ట్ర రహదారుల మీద ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. బుధవారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ప్రయాణికులకు పగటిపూట చుక్కలు కనిపించాయి. దీనిన్నే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాలు, కార్లు, జీపులు రోడ్ల మీదకు దూసుకొచ్చాయి.భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి పట్టణం, మండలాల్లోని ప్రయాణి కులు బస్సుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఆటోలు, క్రూజర్లు, టాటా ఏస్‌లు ప్రయాణికుల రద్దీతో నడిచాయి. హైదరాబాద్, వరంగల్, మోత్కూర్, నల్లగొండ, గజ్వెల్ మార్గాల్లో ఆటోల్లో, ఇతర వాహనాల్లో కిక్కిరిసిపోయారు. దూర ప్రాంతాలకు టికెట్ ధరలను పెంచేశారు.
మిర్యాలగూడ బస్టాండ్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు. డిపోలో తాత్కాలిక డ్రెవర్లు, కం డక్టర్‌లకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన వారిని సంఘ నా యకులు అడ్డుకున్నారు. కాగా ఇరువర్గాల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. సుమారు 200 మంది నిరుద్యోగులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు దఖాస్తులు చేసుకున్నారు.దేవరకొండ డిపోలో కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో ఘర్షణలు జరిగినట్లు పుకార్లు రావడంతో డీఎస్పీ చంద్రమోహన్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెతో బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కోదాడ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రానివ్వలేదు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లిన కొన్ని బస్సులు తిరిగి విజయవాడకు వెళ్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ప్రయాణికులను దింపేసి ఖాళీ బస్సులను పంపించారు. తాత్కాలిక డ్రై వర్లు, కండక్టర్లను నియమిస్తామని చెప్పడంతో కొంత మంది నిరుద్యోగులు డిపో వద్దకు రావడంతో వారిని కార్మికులు అడ్డుకొని వెనక్కు పంపించారు. కోదాడ ప ట్టణ పోలీసులు డిపో వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సూర్యాపేటలో ఎండవేడిమికి తాళలేక ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించి వారి వారి ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రై వేట్ ట్రావెల్స్ వారు అధిక చార్జీలు వసూలు చేసి ప్రయాణికుల నడ్డి విరిచారు. పెళ్లిల సీజన్ కావడం.. వేసవి సెలవుల వల్ల బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి.
రూ.65 లక్షల నష్టం
జిల్లా రీజియన్ పరిధిలో 760 బస్సులు ఉన్నాయి. ఇవి నిత్యం 256 మార్గాల్లో ప్రయాణిస్తుంటాయి. జిల్లా మీదుగా రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రీజియన్ రోజు వారి ఆదాయం రూ.65 లక్షలు. వేసవి సెలవులు, పెళ్లిళ్లు కావడంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ సమ్మె వల్ల రూ.65 లక్షలు నష్టం వాటిల్లింది.
కదలని ‘చక్రం’
Published Thu, May 7 2015 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement