* మెరుగైన వైద్యసేవలు డిప్యూటీ సీఎంకు, ‘సాక్షి’కి బాధితుల కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇందుకు అవసరమైన బిల్లును మంజూరు చేయడంతో వారిని మంగళవారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
నవంబర్ 30వ తేదీన వరంగల్ జిల్లా రఘునాధపల్లి సమీపంలోని యశ్వంత్‌పూర్ వద్ద రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన నయీముల్లాఖాన్, బంధువులు గులాంగౌస్, ఆయన భార్య సాదిక్ ఉన్నీసా బేగం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరికి చేసిన వైద్యానికి సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉంది.
తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధితుల గోడును ఈ నెల 6న ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి ఉపముఖ్యమంత్రి రాజయ్య స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు బాధితుల వైద్య చికిత్స బిల్లులను చెల్లించారు. పరిస్థితి మెరుగుపడటంతో బాధితులు గులాంగౌస్, సాదిక్ ఉన్నీ సాబేగం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యకు, ‘సాక్షి’కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్కార్ట్ ప్రమాద బాధితులకు అందిన సాయం
Published Wed, Dec 10 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement