సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు కేవలం జాతర కోసమే కాకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, గిరిజనాభివృద్ధి శాఖ కమిషనర్ లక్ష్మణ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, సబ్‌కలెక్టర్ గౌతం, డీఎఫ్‌వో రవికిరణ్, పీవో ఐటీడీఏ చక్రదర్, ములుగు డీఎస్పీ రఘువేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment