భూ సేకరణ 96శాతం పూర్తి
భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుకు 96 శాతం భూ సేకరణ పూర్తయిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా మంగళవారం సిద్దిపేటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్దిపేట అనంతగిరి రిజర్వాయర్‌కు 99 శాతం, రంగనాయక సాగర్‌కు 90 శాతం, కొమురవెల్లి మల్లన్నసాగర్‌కు 80 శాతం, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు 85 శాతం భూసేకరణ పూర్తి చేశామని వివరించారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 32.42 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం పనులకు గాను ఇప్పటికే 30 కిలోమీటర్ల పని పూర్తి చేశామని చెప్పారు.
భూసేకరణకు సహకరించిన రైతులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లోనే సంపద సృష్టించ వచ్చనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయడం ఇందులో భాగమని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులతో చెరువుల్లో నీరు చేరిందని, భూగర్భ జలాల పెంపుతో పాటు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వందశాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేసి చెరువుల్లో విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో సమీకృత విక్రయ కేంద్రాలు, చేపల మార్కెట్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడేళ్లలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడటం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.