సర్వేకు రాని ఎన్యూమరేటర్లు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైనప్పటికీ, కొన్ని ప్రాంతాలకు సాయంత్రం అయినా ఎన్యూమరేటర్లు రాలేదు. సర్వే సిబ్బంది వస్తారని ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉన్నారు. కావలసిన డాక్యుమెంట్లతో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 61 శాతం సర్వే పూర్తి అయింది. రంగారెడ్డి జిల్లాలో 61 శాతం, నిజామాబాద్ జిల్లాలో 63 శాతం, మెదక్ జిల్లాలో 70, కరీంనగర్ జిల్లాలో 60, నల్లగొండ జిల్లాలో 70, ఖమ్మం జిల్లాలో 65 శాతం సర్వే పూర్తి అయింది. ఆదిలాబాద్ జిల్లాలో 50 శాతం, వరంగల్ జిల్లాలో 60, మహబూబ్‌నగర్ జిల్లాలో 55 శాతం సర్వే పూర్తి అయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇంకా సర్వే మొదలు కాలేదు. అంబర్‌పేట, రామాంతపూర్, ఇంకా మరికొన్ని ప్రాంతాలకు సర్వే రానేలేదు. కొంత మంది సిబ్బంది కొన్ని ఇళ్లలో మాత్రమే సర్వే పూర్తి చేసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. సిబ్బందిలో కొందరు తమకు అధికారులు 40 ఇళ్ల అడ్రస్‌లు మాత్రమే ఇచ్చారని, మిగతా ఇళ్లలో సర్వే చేయకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. సూరారంకాలనీ, బేగంపేట్,ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, మియాపూర్, చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీ, అమీర్‌పేట్, సైదాబాద్ కాలనీ,సనత్‌నగర్, ఎల్పీ నగర్, సైనిక్‌పురి వద్ద ఆర్‌కే పురం, హబ్సీగూడ, తార్నాకలో ప్రజలు సర్వే సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సిబ్బంది స్థానికులకు సర్వే పుస్తకాలు ఇచ్చి, వివరాలు మీరే నింపండని వదిలివేస్తున్నారు. ఇంటి యజమానులు లేక ఇంట్లో ఉన్నవారు తమ ఇష్టవచ్చిన విధంగా నింపుతున్నారు.
కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సతకపల్లి గ్రామంలో సర్వే జరగకపోవడంతో పంచాయతీ ఎదుట గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఇదే జిల్లా హుస్నాబాద్‌లోని 9వ వార్డులో కూడా ఇంకా ప్రారంభించలేదు. స్థానికులు ఆందోళనకు దిగారు.