నిజామాబాద్ క్రైం : తెలంగాణలో ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌ఎల్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కోర్టు బయట రిలే దీక్షలు చేసిన న్యాయవాదులు.. గురువారం కోర్టు ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. ప్రధాన ద్వారం తలుపులు మూసివేసి దీక్షను కొనసాగించారు. కోర్టు లోపలకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు.
జిల్లా జడ్జి షమీమ్ అక్తర్, అడిషనల్ జడ్జీలు జగ్జీవన్‌కుమార్, తిర్మలాదేవి, రవీందర్‌సింగ్, సబ్ జడ్జి బందె అలీ, మెజిస్ట్రేట్‌లు సరిత, కిరణ్, యువరాజు, రాధాకృష్ణ చౌహాన్‌లనూ లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో జడ్జీలు కోర్టు ప్రాంగణంలోని డీఎల్‌ఎస్ భవనంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని చెప్పినా జిల్లా జడ్జిని వెళ్లనివ్వలేదు. దీంతో ఆయన మరో ద్వారా గుండా లోపలికి వెళ్లారు.
అంతకు ముందు న్యాయవాదులు విధులకు అటంకాలు కలిగిస్తున్నారని జిల్లా జడ్జి ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసులు పోలీసుల బలగాలతో కోర్టుకు వచ్చారు. ప్రధాన ద్వారం వద్దనుంచి వెళ్లాల్సిందిగా న్యాయవాదులను కోరినా వినిపించుకోలేదు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యాయవాదులు ప్రధాన ద్వారం వద్దనుంచి దీక్షా శిబిరానికి వెళ్లారు.
దీక్షలకు మద్దతు
* నాలుగో రోజు దీక్షలో న్యాయవాదులు రమాదేవి, సుమ, ప్రేమలత, భావన, వరలక్ష్మి, మితల్‌కుమారి, వెంకట్ రమణగౌడ్, షహనాజ్ ఆరా, సుభద్ర, అజితారెడ్డి, స్వరూప కూర్చున్నారు. న్యాయవాదులు రాజేంధర్‌రెడ్డి, తుల గంగాధర్, ఎర్రం గణపతి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడి ఎనిమిది నెలలు దాటినా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. కొత్తగా జడ్జీల నియూమకాలు చేపడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయవద్దని కోరారు. సీమాంధ్ర జడ్జీల పెత్తనం వల్లే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కావటం లేదని ఆరోపించారు. తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయూలని డిమాండ్ చేశారు.
‘హైకోర్టు’ కోసం ఆందోళన
Published Fri, Feb 13 2015 3:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement