జంపింగ్‌ జపాంగ్‌లకు.. అగ్రిమెంట్‌ ముకుతాడు!  | Congess Planning New Strategy For Municipal Elections | Sakshi
Sakshi News home page

జంపింగ్‌ జపాంగ్‌లకు.. అగ్రిమెంట్‌ ముకుతాడు! 

Published Fri, Jan 10 2020 8:35 AM | Last Updated on Fri, Jan 10 2020 9:49 AM

Congess Planning New Strategy For Municipal Elections - Sakshi

సాక్షి, నల్లగొండ : ఎన్నికల్లో విజయం సాధించాక.. గెలిపించిన పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరకుండా కాంగ్రెస్‌ ముందే జాగ్రత్త పడుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలపై కన్నేసిన ఆ పార్టీ నాయకత్వం ఒకింత ముందస్తుగానే ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ బీ – ఫారంపై గెలిచాక.. అభివృద్ధి పేర అధికార టీఆర్‌ఎస్‌లోకి మారుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. దీంతో ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయా వార్డుల్లో కౌన్సిలర్లుగా గెలిచాక పార్టీ మారకుండా ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకోవాలని, పార్టీ మారబోమని వారితో అగ్రిమెంటు కుదుర్చుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించిందని చెబుతున్నారు.

ఇవిగో.. గత అనుభవాలు
జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఒక పార్టీనుంచి గెలిచిన వారు ఆ తర్వాత అధికార పార్టీలో చేరుతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజవకర్గ అభివృద్ధి పేర టీఆర్‌ఎస్‌ బాట పట్టారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన వారు పలు మండలాల్లో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పార్టీ మారారు. దీంతో కాంగ్రెస్‌ కొన్నిచోట్ల ఎంపీపీ పదవులను దక్కించుకోలేకపోయింది.

ఇక, 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులకుగాను 22 వార్డులను గెలుచుకుని చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. కానీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన పదిహేను మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. చైర్‌పర్సన్‌గా ఉన్న లక్ష్మి కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి కొద్ది రోజులకే తిరిగి సొంత గూటికి చేరారు. పార్టీ మారిన కౌన్సిలర్లలో మరో నలుగురు కూడా తిరిగి వెనక్కి వచ్చేశారు. మిగతా వారు అధికార పార్టీలోనే ఉన్నారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీలోనూ ఇదే జరిగింది.. మొత్తం 36 వార్డులకు గాను 30 వార్డులను కాంగ్రెస్‌ గెలుచుకుని పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. కానీ, కొన్నాళ్లకు ఈ 30మందిలో ఏకంగా 25మంది టీఆర్‌ఎస్‌లోకి మారిపోయారు. గత ఎన్నికల నాటికి నగర పంచాయతీగా ఉన్న దేవరకొండలో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 11 మంది కౌన్సిలర్లలో 10మంది పార్టీ మారారు. మూడు చోట్లా పాలక వర్గాలను కాంగ్రెస్‌ ఏర్పాటు చేసినా.. పదవీ కాలం పూర్తయ్యే వరకు నల్లగొండ మాత్రమే కాంగ్రెస్‌ చేతిలో మిగలగా, మిర్యాలగూడ, దేవరకొండ టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరిపోయాయి. ఈ గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ముందుగానే అగ్రిమెంట్‌
ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏడు చోట్లా విజయావకాశాలను ఉన్నాయని ఆశిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఫలితాల తర్వాత పరిస్థితి తారుమారు కాకుండా ఎత్తులు వేస్తోంది. గెలిచాక పార్టీ మారబోమని ఒప్పందాలు చేసుకుంటోంది. పార్టీ బీ– ఫారం ఇచ్చి, కొంత ఖర్చు పెట్టి గెలిపించుకుంటుంటే ఆ తర్వాత పార్టీ మారిపోతున్నారని, ఈసారి ఇలాంటి సంఘటనలను నివారించేందుకు పీసీసీ నాయకత్వమే ఈ ఆలోచన చేసిందని జిల్లా పార్టీ నాయకత్వం చెబుతోంది.

అయితే, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచాక ఎందరు కౌన్సిలర్లు ఈ అగ్రిమెంట్‌కు కట్టుబడి ఉంటారు..? పార్టీ మారకుండా మాతృపార్టీనే నమ్ముకుని ఎంతమంది నిలబడతారు..? ఈ అగ్రిమెంటుకు ఎంత విలువ ఉంటుంది..? అన్న ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్‌ నాయకుల వద్ద సరైన సమాధానం లభించడం లేదు. ఒప్పందాన్ని మీరకుండా కట్టుబడి ఉండడం నైతిక విలువలకు సంబంధించిన అంశమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంటుతోపాటు, ఎన్నికల్లో ఖర్చుల కోసం ఇచ్చే మొత్తానికి చెక్కులు కూడా రాయించుకునే వీలుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ముందుగానే చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీంతో వార్డు అభ్యర్థులకు.. చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించిన నేతకు మధ్య ఈ ఒప్పందం ఉంటుందా..? లేక, అభ్యర్థికి, పార్టీకి మధ్య ఉంటుందా..? అన్న అంశం తేలాల్సి ఉందని చెబుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement