ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయరా?
⇒ కాంగ్రెస్, బీజేపీ ప్రశ్న
⇒ అసెంబ్లీలో విద్యాశాఖ పద్దులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాల యాలు, డైట్ కళా శాలల్లో ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గురువారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్దులపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు బడ్జెట్లో పాఠశాల విద్యకు భారీగా నిధులు కేటాయిం చాల్సి ఉండగా అరకొరగా రూ.10,215 కోట్లు మాత్రమే కేటాయించారని ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు 50 నుంచి 46 శాతానికి తగ్గిపోయాయన్నారు. అనేక స్కూళ్ల లో మరుగుదొడ్లు లేవని, దాదాపు 16 వేల స్కూళ్లలో నీటి వసతి లేదని అన్నారు. భవ నాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిం చకుండానే కొత్త బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించడం సరికాదన్నారు.
విద్యాశాఖకు తక్కువ కేటాయింపులు: మజ్లిస్
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా శాఖకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ అన్నారు. బీసీ, మైనారిటీల కోసం కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నా మన్నారు. కాగా, కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం రాత్రికి రాత్రి అమలు కాదని, దశల వారీగా అమలు జరుగుతుందని టీఆర్‌ఎస్ సభ్యుడు గ్యాదరి కిశోర్ అన్నారు.
ప్రైవేటు ఫీజుల దోపిడీపై ప్రేక్షక పాత్ర : కె.లక్ష్మణ్
దేశ రాజధాని ఢిల్లీ కన్నా హైదరాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, కార్పొరేట్ జూనియర్ కళాశా లలు సైతం మూడు నాలుగు లక్షల ఫీజులను దండుకుంటున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు..
ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ కళాశాలల ఫీజులను ఎందుకు నిర్ణయించలేకపోతోందని ప్రశ్నించారు. కేజీ టు పీజీ విద్యా పథకానికి ఇంకా ఓ విధానాన్ని రూపొందించలేదని ఆయన తప్పుపట్టారు.
శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో 1,267 ప్రొఫెసర్ పోస్టులకుగాను 553 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు కనీసం 3,500 బోధన సిబ్బంది అవసరమని అన్నారు.