రేపే విడుదల | congress candidate list releases tomorrow | Sakshi
Sakshi News home page

రేపే విడుదల

Published Fri, Nov 9 2018 8:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress candidate list releases tomorrow - Sakshi

   

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:
కాంగ్రెస్‌ పార్టీ గత కొద్దిరోజులుగా సాగిస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మహాకూటమి పొత్తులతో పాటు పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను కూడా ఖరారు చేసింది. ఈనెల 10న కాంగ్రెస్‌కు చెందిన 74 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఎంత మంది ఉంటారో తెలియదు. అయితే పది నియోజకవర్గాల్లో సీపీఐకి వదిలిన బెల్లంపల్లి మినహా తొమ్మిది స్థానాల అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. టికెట్టు పోటీ తీవ్రంగా ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్, బోథ్, ముథోల్‌ నియోజకవర్గాల నుంచి ఆశావహులను ఢిల్లీలోని వార్‌రూంకు పిలిచిన కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ నేతలు వారితో విడివిడిగా సమావేశమయ్యారు. ఎవరికి టికెట్టు వచ్చినా మరొకరు సహకరించాలని, విజయమే లక్ష్యంగా పనిచేయాలని హితబోధ చేశారు.

గెలుపు గుర్రాల వైపే మొగ్గు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక వెనుక భారీ స్థాయిలో కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ సూచించిన పేర్లను కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకొని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్, ఆసిఫాబాద్‌ స్థానాలకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కులకు పోటీ లేకపోవడంతో వారే ఖరారయ్యారు. మిగతా చోట్ల టికెట్లు ఆశిస్తున్న నాయకుల బలాబలాలను అంచనా వేయడంతో పాటు ప్రజాదరణ ఎవరికి ఉంది? టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆర్థికంగా ఎదుర్కొనే శక్తి ఉన్న నాయకుడెవరు? పార్టీ కేడర్‌ ఎటువైపు ఎక్కువగా ఉందనే పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. 

పోటీదారులను బుజ్జగించి...
మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి మధ్య టికెట్టు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈనేపథ్యంలో గురువారం ఇద్దరు నేతలను ఢిల్లీ పిలిపించిన స్క్రీనింగ్‌ కమిటీ నేతలు, పీసీసీ కోర్‌ కమిటీ సభ్యులు ఎవరికి టికెట్టు ఇచ్చినా కలిసి పని చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో ఆలోచించి టికెట్లు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యామ్నాయ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని చెపుతూ బుజ్జగించినట్లు సమాచారం. 

  • ముథోల్‌ నుంచి టికెట్టు ఆశిస్తున్న రామారావు పటేల్‌ ఒక్కరే ఢిల్లీలో వార్‌రూం సమావేశానికి హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ వెళ్లలేదు. దీంతో ఏమీ చర్చించలేదని సమాచారం. తొలిజాబితాలో ఈ సీటు ఉంటుందా? ఉండదా? అనేది తేలాల్సింది. 
  • ఆదిలాబాద్‌లో టికెట్టు ఆశిస్తున్న గండ్రత్‌ సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డిలను మాత్రమే పిలవగా, సమావేశానికి భార్గవ్‌ దేశ్‌పాండే కూడా హాజరయ్యారు. ఎవరికి వారే టికెట్టు కోసం తమ వాదనలు వినిపించినట్లు సమాచారం.

బోథ్‌లో సోయం బాబూరావు, అనిల్‌ జాదవ్‌లతో పరిస్థితిని వివరించినట్లు సమాచారం.  మిగతా నియోజకవర్గాల నాయకులతో మంగళ, బుధవారాల్లో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చారు. కాగా 74 మందితో కూడిన తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ఎన్ని స్థానాల పేర్లు ఉంటాయనేదే సస్పెన్స్‌గా మారింది.

 సీపీఐకి బెల్లంపల్లి 

నాలుగు పార్టీల మహాకూటమిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తొమ్మిది సీట్ల నుంచి పోటీ చేయనుండగా, సీపీఐ బెల్లంపల్లి నుంచి బరిలో నిలువనుంది. తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్‌పై ఎలాంటి ఆశలు పెట్టుకోకపోగా, చెన్నూరు, ఆసిఫాబాద్‌ స్థానాలు కోరిన తెలంగాణ జన సమితికి అవకాశం దక్కలేదు. మంచిర్యాల కోసం సీపీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బెల్లంపల్లిని సీపీఐకి కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్‌ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ ఇన్‌చార్జి చిలుముల శంకర్‌తో పాటు పలువురు ఆశావహులు టికెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement