
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇద్దరు కార్య నిర్వాహక అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు ఎన్నికలకు సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించిన జాబితాను బుధవారం విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన తొమ్మిది కమిటీల్లో జిల్లాకు చెందిన సుమారు అరడజను మంది నేతలకు చోటు దక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా వ్యవహరించే మేనిఫెస్టో కమిటీలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్‌తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డికి సభ్యులుగా చోటు దక్కింది.
కోర్ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సభ్యులుగా ఉంటారు. ప్రచార కమిటీలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సమన్వయ కమిటీలో దామోదర, గీతారెడ్డి, జగ్గారెడ్డి, ప్రచా ర కమిటీలో జగ్గారెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో దామోదర, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్ సభ్యులుగా నామినేట్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన అనంతుల శ్యాం మోహన్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎల్డీఎమ్మార్సీ కమిటీ చైర్మన్‌గా ఆరేపల్లి మోహన్ కొనసాగుతారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మాత్రమే చోటు కల్పించడంపై మెదక్, సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment