సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం)
తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని హితవు పలికారు.
కూల్చివేత దారుణం: జీవన్ రెడ్డి
సచివాలయాన్ని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద కట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఊరి వాడికి వారి ఆపద వస్తే... ఊసు గళ్ళ వాడికి దోమల ఆపద అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సచివాలయ భవనాలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment