కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 33 స్థానాల్లో 12 స్థానాలను కైవసం చేసుకుని ఆ పార్టీ సత్తా చాటింది. స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో మున్సిపల్ ఎన్నికల పలితాలను సోమవారం వెల్లడించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 11 గంటల వరకు కొనసాగింది. మొత్తం 33 వార్డులకు 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 32 మంది, సీపీఐ నుంచి 22, టీడీపీ నుంచి 30, టీఆర్‌ఎస్ నుంచి 11, సీపీఎం నుంచి ఏడుగురు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 21 మంది, బీజేపీ నుంచి ఇద్దరు, టీఆర్‌ఎల్‌డీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ 12, సీపీఐ ఎనిమిది, టీడీపీ నాలుగు, వైఎస్‌ఆర్‌సీపీ ఒకటి, టీఆర్‌ఎస్ ఒకటి, టీఆర్‌ఎల్డీ ఒకటి, స్వతంత్రులు ఆరువార్డుల్లో విజయం సాధించారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది.
సత్తాచాటిన స్వతంత్రులు
ఆది నుంచి కొత్తగూడెం మున్సిపాలిటీలో స్వతంత్రులు అన్ని వార్డుల్లో కీలకంగా మారారు. మొత్తం 33 వార్డుల్లో 60 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ దఫా బరిలో నిలిచారు. కొన్ని వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి స్వతంత్రులు కారణమయ్యారు. కొన్ని వార్డుల్లో ఏకంగా స్వతంత్రులు గెలుపొందారు. 33 వార్డుల్లో ఆరింటిలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడంతో నూతనంగా ఏర్పాటయ్యే కౌన్సిల్‌ల్లో వీరు ప్రధాన భూమిక పోషించనున్నారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన అభ్యర్థి తాండ్ర శ్రీనివాస్ మూడో వార్డు నుంచి విజయం సాధించటం గమనార్హం.
సీపీఐ, టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓటమి
సీపీఐ, టీడీపీలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలకు చెందిన చైర్‌పర్సన్ అభ్యర్థినులు ఓటమి పాలవడం గమనార్హం. సీపీఐ చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ప్రకటించిన డాక్టర్ శైలజ 18వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిని దుంపల అనురాధ చేతిలో ఓటమి చవిచూశారు. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థినిగా పేర్కొన్న తొగరు జయంతి (రెండో వార్డు) కాంగ్రెస్ అభ్యర్థిని యెమునూరి లక్ష్మీబాయి చేతిలో ఓడిపోయారు. టీఆర్‌ఎస్, బీజేపీ, జేఏసీలతో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం పెట్టుకుంది. అయితే ఆ కూటమిని ప్రజలు ఆదరించకపోవడంతో సీపీఐ నేతలు నైరాశ్యంలోకి వెళ్లారు. టీడీపీ కేవలం నాలుగు వార్డులతోనే సరిపెట్టుకుంది.
వనమా అండదండలతోనే కాంగ్రెస్ గెలుపు...
మున్సిపల్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌లో ఉండి...సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు ప్రాబవం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. వనమా కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందని పలువురంటున్నారు. సీపీఐ, టీఆర్‌ఎస్, బీజేపీ, జేఏసీలు పొత్తు కుదుర్చుకొని 32 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించినా వనమా అంతా తానై ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కొత్తగూడెం రాజకీయాల్లో ఆయనంటే ఏమిటో నిరూపించుకున్నారని విమర్శకులు అంటున్నారు.
గూడెం’లో హస్తానికి ఊరట
Published Tue, May 13 2014 2:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement