పెద్దపల్లి/ఎల్లారెడ్డి: రాష్ట్రంలో టీఆర్‌ఎస్, దేశం లో కాంగ్రెస్ పార్టీలు దేశ ద్రోహులతో చేతులు కలిపాయని, ఆ పార్టీలు దేశద్రోహులకు బిర్యానీలు పెడితే.. ప్రధాని నరేంద్రమోదీ బుల్లెట్లతో సమాధానం చెప్పారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్‌కు మద్దతుగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీల తీరుపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు కొమ్ముకాస్తే, ప్రధాని మోదీ ప్రభుత్వం వారిని ఉక్కుపాదం తో అణచివేస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ వాలకం చూస్తుంటే తెలంగాణలో మరోసారి రజాకార్ల పాలన వచ్చేలా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కావాల్సినన్ని నిధులు కేటాయించిందని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. గత పాలకుల అసమర్థత కారణంగా మూతపడిన రామగుండం ఎరువు ల కర్మాగారానికి మోదీ ప్రభుత్వం రూ.5,500 కోట్లు కేటాయించి పునరుద్ధరణ పనులను వేగంగా జరిపిస్తోందని గుర్తు చేశారు. దీనితో చాలామంది స్థానిక యువకులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు.
సైనికులను అవమానించిన కేసీఆర్..
ప్రాణాలకు తెగించి దేశభద్రత కోసం పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత జవాన్లను అవమానించి కేసీఆర్, కాంగ్రెస్ నేతలు పెద్ద తప్పు చేశారని యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఈ నేలపై మాట్లాడటం నా అదృష్టం
తెలంగాణలోని ఈ ప్రాంతం శ్రీరామచంద్రుడు నడయాడిన నేల అని యోగి అన్నారు. ఇక్కడి నేలను సాధనక్షేత్రంగా చేసుకుని లంకపై రాముడు యుద్ధానికి వెళ్లాడన్నారు. ఇంతటి మహత్తు కలిగిన పెద్దపల్లి గడ్డపై నుంచి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను ఓడించి రెండోసారి మోదీకి పట్టం కట్టాలని కోరారు. పెద్దపల్లి నుంచే విజయయాత్ర ఆరంభం కావాలని, ఇక్కడి బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
తెలంగాణలో మాఫియా రాజ్యం
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన అన్ని రకాల అరాచక శక్తులకు ఊతమిస్తూ మాఫియా రాజ్యాన్ని కొనసాగిస్తోందని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ నిర్వహించిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్గత రక్షణకు విఘాతం కల్పిస్తున్న ఎంఐఎం అధినేత ఒవైసీ లాంటి నేతలకు మద్దతు పలు కుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు దేశద్రోహానికి పాల్పడుతున్నాయని ఆదిత్యానాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రక్షణ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు చేతులు కట్టేసుకుని కూర్చోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. దేశ రక్షణకు బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారన్నారు. 300 పైగా ఎంపీ స్థానాలను గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వారిది బారూ.. బీరూ.. సారూ..
సారూ.. కారూ.. పదహారు అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రచారం పసలేనిదని, బారూ.. బీరూ.. సారూ అన్నది వారి అసలైన విధాన మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 16 స్థానాలతో మోదీ మెడలు వంచుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. తండ్రి కేసీఆర్ సహాయంతో బావ హరీశ్‌రావు మెడలు వంచినట్లు అనుకుంటున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో కూతురుకు పరాజయం తప్పదని గ్రహించిన సీఎం కేసీఆర్.. తన స్థాయిని దిగజార్చుకుని తెలుగుదేశం విశ్రాంత నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించా రని విమర్శించారు.
నిజామాబాద్ ఎంపీగా కవిత ఐదేళ్లలో చేసిన ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదని, అందుకే 178 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచి నిరసన తెలిపారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లు అంటున్నట్లు బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ కాదని, భారత్‌కో జితానే వాలీ పార్టీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్లేనని, అందుకే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్, బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్‌గౌడ్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment