సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయాన్నే ప్రదర్శించింది. ఎవరు ఎంతగా పట్టుబట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నా.. అధిష్టానం తాను అనుకున్న విధంగానే ఎన్నికల ‘సైన్యాన్ని’ఏర్పాటు చేసింది. బుధవారం ప్రకటించిన 10 కమిటీల్లో సామాజిక సమతుల్యతను పాటించడంతోపాటు కీలక నేతలు ఆశించిన పదవులను ఇవ్వకుండానే ప్రక్రియను పూర్తి చేసింది. ముఖ్యంగా ప్రచార కమిటీ విషయంలో కాంగ్రెస్ తన ప్రత్యేకతను చాటుకుంది.
ఈ కమిటీ సారథ్య బాధ్యతలు ఆశించిన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, యువ నాయకుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు వీహెచ్, జైపాల్‌రెడ్డిలకు షాక్ ఇచ్చింది. ఈ పదవిని అనూహ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. ఈ కమిటీ కోచైర్మన్‌గా మాత్రం డి.కె.అరుణను నియమించింది. కోమటిరెడ్డి, రేవంత్‌లకు ఆ కమిటీలో స్థానం కూడా కల్పించలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యాధికుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్‌ను ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించడం విశేషం. ఇక, ఈ కమిటీలో యువనేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి, ఇటీవల అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో పాటు ఇద్దరు ఓయూ జేఏసీ నేతలతో కలిపి మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు.
ప్రచార కమిటీతో పాటు మేనిఫెస్టో కమిటీ బాధ్యతలను కూడా ఇద్దరు దళిత నేతలకు అప్పగించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ముందు నుంచీ అనుకున్నట్టుగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. ఈ కమిటీకి కో చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. ఆయనకు పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అయితే, ఈ కమిటీల పట్ల పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కమిటీల రూపకల్పనలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కల హవానే నడిచిందని, వారిద్దరి మార్కు కమిటీలుగానే ఇవి కనిపిస్తున్నాయని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు...
పార్టీలో మొదటి నుంచీ ప్రచారం జరుగుతున్న విధంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క(ఎస్సీ)కి తోడు ఒక ఓసీ, ఒక బీసీ నేతను కూడా ఆ హోదాలో నియమించారు. పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు ఆశించిన రేవంత్‌రెడ్డి, మొదటి నుంచీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించడంతో ఎస్సీ, బీసీ, ఓసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించినట్టయింది. అయితే, టీపీసీసీకి రేవంత్, పొన్నం ప్రభాకర్‌లే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉంటారని, భట్టి ప్రచార కమిటీ చైర్మన్ హోదాలోనే పనిచేస్తారని టీపీసీసీ చెబుతున్నా.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
సభ్యుడిగానే జానారెడ్డి...
సీఎల్పీ నాయకుడిగా పనిచేసిన జానారెడ్డికి ఆయన స్థాయికి తగిన కమిటీల్లో అవకాశం కల్పించినప్పటికీ, ఏ ఒక్క కమిటీ సారథ్య బాధ్యతలు ఆయనకు అప్పగించలేదు. పార్టీ కోర్‌కమిటీ, సమన్వయ కమిటీ, టికెట్ల ఖరారులో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఎన్నికల కమిటీల్లో జానారెడ్డిని సభ్యుడిగా నియమించారు. అయితే, ఏదో ఒక కమిటీకి ఆయన్ను చైర్మన్‌గా నియమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ ఇద్దరికీ ప్రాధాన్యం...
పీసీసీ మాజీ అధ్యక్షుల హోదాలో పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావులకు టీపీసీసీ కమిటీల్లో ప్రాధాన్యత లభించింది. ఈ ఇద్దరినీ పార్టీ కోర్ కమిటీ, సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీల్లో నియమించారు. వీటికి అదనంగా పొన్నాలకు మేనిఫెస్టో కమిటీలో అవకాశం ఇవ్వగా, పార్టీ వ్యూహరచన, ప్రణాళిక రూపకల్పన కమిటీ చైర్మన్ బాధ్యతలను వీహెచ్‌కు అప్పగించారు. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, సీనియర్ నేత జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి హేమాహేమీలను సభ్యులుగా నియమించడం విశేషం.
బ్రదర్స్‌కు మూడు పదవులు...
రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పదవులను ఆశించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అధిష్టానం కొంత అభిమానాన్ని చూపించినప్పటికీ, పూర్తిగా సంతృప్తికర పదవులను ఇవ్వలేకపోయిందనే చర్చ జరుగుతోంది. పార్టీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్‌గా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించిన అధిష్టానం, ఎన్నికల కమిటీలో రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించింది.
రేవంత్‌కు నిరాశే..!
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యువ నేత రేవంత్‌రెడ్డికి ఓ రకంగా కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఖరారు చేసినప్పటికీ ఆయన వద్దనడంతో పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఎన్నికల కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని, ప్రచార కమిటీ బాధ్యతలిస్తారని రేవంత్, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినే రేవంత్‌కు అప్పగించింది.
ఆయనకు పదవి రాకుండా పార్టీలోని సీనియర్లే అడ్డుకున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌కు కీలక బాధ్యతలిస్తే వన్‌మ్యాన్ షో చేస్తారని, ఎంతో మంది సీనియర్లను కాదని, ఇటీవలే పార్టీలోకి వచ్చిన నేతకు కీలక బాధ్యతలిస్తే ఆయనపై పార్టీ ఆధారపడిందనే అభిప్రాయం కలుగుతుందని సీనియర్లు అధిష్టానం వద్ద తమ వాదనలను బలంగా వినిపించడంతోనే రేవంత్‌కు అడ్డుకట్ట పడిందనే చర్చ జరుగుతోంది. గత నెలలో రాహుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగానికి వచ్చిన అనూహ్య స్పందన కూడా దీనికి ఆజ్యం పోసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రేవంత్‌తో పాటు పార్టీలో చేరిన సీతక్క, విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డి, బిల్యానాయక్‌లకు పలు కమిటీల్లో చోటు కల్పించడం గమనార్హం.
పండగే పండగ..
ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించిన నేతల జాబితా చాంతాడంత ఉన్నప్పటికీ, ఆయా కమిటీల్లో పేర్లు వచ్చిన నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సమన్వయ కమిటీలో ఏకంగా 53 మందిని, ఎన్నికల కమిటీలో 41 మందిని నియమించడం, ఎన్నికల కమిటీలో పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా ఉన్న 11 మంది నేతలకు ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. అయితే, ఈ అనుబంధ సంఘాల్లో వికలాంగ విభాగం చైర్మన్ పేరు లేదు. ఏఐసీసీ స్థాయిలో వికలాంగ విభాగం అధికారికం కాకపోవడంతోనే కేవలం 11 మంది చైర్మన్లకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. మరోవైపు ఎల్‌డీఎంఆర్‌సీ, ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ, క్రమశిక్షణా కమిటీల పేరుతో మరో 19 మంది నేతలకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండే నేతలకు ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీలో అవకాశమిచ్చారు.
మహిళలు పది మందే...
ఏఐసీసీ ప్రకటించిన 10 కమిటీల్లో కేవలం 10 మంది మహిళా నేతలకే అవకాశమిచ్చారు. డి.కె.అరుణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విజయశాంతి, రేణుకా చౌదరి, సీతక్క, పద్మావతి, నేరెళ్ల శారద, ఆకుల లలిత, అజ్మతుల్లా హుస్సేనీలకు పలు కమిటీల్లో స్థానం కల్పించారు. వీరిలో కేవలం అరుణకు మాత్రమే ప్రచార కమిటీ కోచైర్మన్ బాధ్యతలిచ్చారు. అయితే, విజయశాంతి పేరు తొలుత ప్రకటించిన కమిటీల్లో లేకపోగా, ఆ తర్వాత విడిగా ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును అటు స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించకపోగా, ఏ కమిటీల్లో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు. ఇక, మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డిల పేర్లు కూడా కమిటీల్లో లేవు.
సురేశ్‌రెడ్డి పేరు ప్రత్యక్షం
ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేరు ఉండడం చర్చనీయాంశమైంది. పార్టీ సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లో సురేశ్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న అధిష్టానం ఆయా కమిటీలను మార్పు చేస్తూ సురేశ్‌రెడ్డి పేరు తొలగించి మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సురేశ్‌రెడ్డి పేరు జాబితాలో ఉండడంతో ఈ కమిటీల నియామక ప్రక్రియ 10 రోజుల క్రితమే పూర్తయిందనే చర్చ జరుగుతోంది. 10 నుంచి 15 రోజుల క్రితమే కసరత్తు పూర్తయినా అధిష్టానం ఈ జాబితాలను ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యమేమిటనేది కాంగ్రెస్ ముఖ్య నేతలకు కూడా అంతుబట్టడం లేదు.
ఐదు జిల్లాలకు అధ్యక్షులేరీ..?
ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో ఐదు ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులుగా పనిచేస్తున్న నేతల పేర్లు కనిపించలేదు. నల్లగొండ, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ అధ్యక్షులు ఉన్నా వారికి ఏ కమిటీలోనూ అవకాశమివ్వలేదు. కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులకు మాత్రం పలు కమిటీల్లో స్థానం కల్పించారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ పేరు కూడా ఏ కమిటీలోనూ లేకపోవడం గమనార్హం.
మొదటి వారంలో టికెట్లు?
పార్టీ ఎన్నికల కమిటీని కూడా ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారీకి మార్గం సుగమం అయింది. ఈ కమిటీనే పార్టీ అభ్యర్థుల జాబితా కింద అర్హులైన ఆశావహుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ పేర్లను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ తమకుండే అభ్యంతరాలపై స్థానిక నాయకత్వంతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిటీ రావడంతో ఆ కమిటీ భేటీ రెండు, మూడు రోజుల్లో జరుగుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటివారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందనే చర్చ జరుగుతోంది.
వీహెచ్ అసంతృప్తి
పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను నియమించకపోవడంతో వీహెచ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన జాబితా వచ్చిన తర్వాత తనకు వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్ అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ కూడా మీడియా వద్ద తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి పదవి ఇవ్వడం సబబు కాదని, ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పొంగులేటి పేర్కొన్నారు. తమకు పదవులు అవసరం లేదని, పదవులు లేకున్నా పార్టీకోసం పనిచేస్తామని డీకే అరుణ నిర్వేదంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మార్క్ ‘సైన్యం’ తయార్
Published Thu, Sep 20 2018 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment