హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విఫక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. పోడు వ్యవసాయం చేస్తున్న వారికి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పట్టాలు, పాస్ బుక్కులు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీపీఎం, సీపీఐ, ఉద్యోగుల వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంపుపై బీజేపీ, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
కాగా సభలో నేడు బడ్జెట్ పై చర్చ కొనసాగుతుంది. సభను అడ్డుకుంటున్నారన్న కారణంతో పది మంది తెలుగుదేశం సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీరి సస్పెన్షన్ ఈ నెల 21 వరకూ అమలుతో వుండగా... అసెంబ్లీ సమావేశాలు 22 వరకు కొనసాగనున్నాయి. విపక్ష సభ్యులు సస్పెన్షన్‌ను సడలించాలని కోరినా ప్రభుత్వం మాత్రం రాజద్రోహానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్న పట్టుదలతో ఉంది.
నేడు సభలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. హైదరాబాద్ పరిధిలో భూ కేటాయింపులు, ఇంజనీరింగ్ ప్రవేశాలు, వృద్ధాప్య పింఛన్లపై చర్చ జరుగనుంది. భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విఫక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. మరోవైపు కేసీఆర్ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.