సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా శనివారం (23న) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు కోదండరాం (టీజేఎస్), లక్ష్మణ్ (బీజేపీ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ) లను ఆహ్వానించినట్లు గురువారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా జరుగుతున్న ఫిరాయింపులపై ప్రజలందరూ ఆలోచించాలని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చించాలనే ఆలోచనతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం కూడా కాంగ్రెస్ ఖాతాలోకే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి (మల్కాజ్‌గిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (భువనగిరి), విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల)లు తప్పకుండా విజయం సాధిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఖమ్మం లోక్‌సభలోనూ కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉందని అన్నారు. రాహుల్‌గాంధీ గాలి వీస్తే ఎక్కువ స్థానాలు ఈసారి కాంగ్రెస్‌కే వస్తాయని అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు గంపగుత్తగా పడే అవకాశం ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు కాదు కదా మనం ఓటేసేదని జనం అనుకుంటే టీఆర్‌ఎస్ ఊహించని ఫలితాలు కూడా వస్తాయని చెప్పారు. పార్టీని వీడి వెళ్లే వారి విషయంలో పార్టీ తప్పేమీ లేదని, వారి బలహీనతల కార ణంగానే పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి రమ్మని తనను ఇంతవరకు అడగలేదని, అసలు టీఆర్‌ఎస్‌లోకి తనను తీసుకోరని చెప్పారు. అయినా పార్టీ మారే విషయంలో తన బిడ్డ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. ఎవరు ఉన్నా, వెళ్లిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్ అని, 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment