Jaggareddi
-
పీసీసీ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులో తానూ ఉన్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సీఎం పదవిని ఆశించకుండా తాను పనిచేస్తానని, ఈ విషయం చెప్పేందుకు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు కీలక నేతలు రాహుల్, అహ్మద్‌పటేల్, కె.సి.వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాను కలుస్తానని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని ఢిల్లీ నుంచి వార్తలొస్తున్నాయని, అదే నిజమైతే మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని తాను అధిష్టానాన్ని కోరతానని తెలిపారు. . -
ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు. -
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలకు పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం ఉండదని, తనంతట తాను ఉత్తమ్ తప్పుకుంటే తప్ప పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండ దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ తప్పుకుంటే పీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలుంటారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటి ఇచ్చిందని చెప్పిన జగ్గారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 20–25 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలు స్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే సానుకూలత ఉంటుందని, అయినా కాంగ్రెస్ కూడా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం లో యూపీఏ అధికారంలోకి వస్తుందన్నారు. -
కేసీఆర్‌కు గుడి కట్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరను రెండేళ్ల కాలపరిమితిలో అమలు చేసి చూపిస్తే సంగారెడ్డిలోనే ఆయనకు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధర విధానాన్ని అమలు చేస్తానని అధికారులకు కేసీఆర్ ఇచ్చిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ రైతుల తరఫున ప్రకటన చేయడంపై జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చినందు వల్లే కేసీఆర్‌కు ఏదైనా చేసే అవకాశం వచ్చిందన్నారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్‌గాంధీలకు కూడా మరో ఆలయం కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్ చెప్పిన రైతుకు గిట్టుబాటు ధర విషయం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలా జరిగితే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ విషయాన్ని తాను మానవతా దృక్పథంతో చెపుతున్నానని తెలిపారు. దేవుడు దిగొచ్చినా సాధ్యం కాదు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. అవినీతిని నిర్మూలించే శక్తి ఏ రాజకీయ వ్యవస్థకు లేదని, దేవుడే దిగొచ్చినా లంచగొండితనం నిర్మూలన సాధ్యం కాదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన విషయంలో ఆ శాఖ అధికారుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదని చెప్పారు. -
పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్షం’: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా శనివారం (23న) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు కోదండరాం (టీజేఎస్), లక్ష్మణ్ (బీజేపీ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ) లను ఆహ్వానించినట్లు గురువారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా జరుగుతున్న ఫిరాయింపులపై ప్రజలందరూ ఆలోచించాలని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చించాలనే ఆలోచనతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం కూడా కాంగ్రెస్ ఖాతాలోకే: జగ్గారెడ్డి సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి (మల్కాజ్గిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (భువనగిరి), విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల)లు తప్పకుండా విజయం సాధిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఖమ్మం లోక్‌సభలోనూ కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉందని అన్నారు. రాహుల్‌గాంధీ గాలి వీస్తే ఎక్కువ స్థానాలు ఈసారి కాంగ్రెస్‌కే వస్తాయని అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు గంపగుత్తగా పడే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు కాదు కదా మనం ఓటేసేదని జనం అనుకుంటే టీఆర్ఎస్ ఊహించని ఫలితాలు కూడా వస్తాయని చెప్పారు. పార్టీని వీడి వెళ్లే వారి విషయంలో పార్టీ తప్పేమీ లేదని, వారి బలహీనతల కార ణంగానే పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్లోకి రమ్మని తనను ఇంతవరకు అడగలేదని, అసలు టీఆర్ఎస్లోకి తనను తీసుకోరని చెప్పారు. అయినా పార్టీ మారే విషయంలో తన బిడ్డ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. ఎవరు ఉన్నా, వెళ్లిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్ అని, 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారని అన్నారు. -
‘సింగూరు కోసం 18 నుంచి రిలే దీక్ష’
సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. -
సామాజిక కోణాలు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణాలు చెల్లవని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక తేలిపోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి తనకు ఆహ్వానం లేదని, అయినా తనకు అంత ప్రోటోకాల్ లేదని అన్నారు. కేసీఆర్ భట్టికి ఇచ్చే ప్రాధాన్యత ఉత్తమ్‌కు ఇవ్వకపోవచ్చని అన్నారు. సీఎల్పీ నేత ఎంపిక విషయంలో రాహుల్ నిర్ణయమే శిరోధార్యమని, సీఎల్పీ నేత ఎంపికలో లాబీయింగ్‌తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా పనిచేసిందని అన్నారు. సీఎల్పీ నేతగా నియమించి భట్టికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశం ఇచ్చిందని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా భట్టి తన పనితనాన్ని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లరని జగ్గారెడ్డి చెప్పారు. ఓడిపోయిన నేతలకు పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కారణం కానే కాదని, ఆయన సమర్ధవంతంగా పనిచేశారని, కానీ పరిస్థితులు అనుకూలించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఉత్తమ్ గొప్పవాడు అన్న సర్వే సత్యనారాయణ ఇప్పుడు ఉత్తమ్ పనికిరాడని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఉత్తమ్ మంచోడు.. ఇప్పుడు చెడ్డోడా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉత్తమ్ బలహీనుడు కాదని, బలవంతుడని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగించినా తప్పేమీ లేదని అన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతి పోటీచేయకపోతే తన భార్య నిర్మలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరతానని జగ్గారెడ్డి చెప్పారు. -
సోనియా భిక్షతోనే అధికారంలో టీఆర్ఎస్
మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీ, కాంగ్రెస్ పెట్టిన భిక్ష కారణంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీశ్‌రావు మంత్రి పదవుల్లో ఉన్నారని మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. తెలంగాణ రాకుంటే హరీశ్‌రావు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని గాంధీభవన్‌లో శనివారం సూచించారు. ఫైళ్లు పట్టుకుని పైరవీల కోసం మంత్రుల చుట్టు తిరిగిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుంచుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో టీఆర్ఎస్ అవినీతికి తేరలేపిందని ఆరోపించారు. ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ కనీసం సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోవడం దారుణమన్నారు. -
ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు
మేము అధికారంలోకి వస్తే కేసీఆర్, హరీశ్ జైలుకే.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మల్యే తూర్పు జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తిరిగి ప్రారంభిస్తూ వాటికి కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి తూర్పు జగ్గారెడ్డి అరోపించారు. శనివారం అయన విలేకరులతో మట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, తాము ఎప్పుడూ ప్రాజెక్టులను అడ్డుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాలోనే ప్రాణహిత-చేవెళ్లు ప్రాజెక్టును చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టుకు పేర్లు మార్చి, వేల కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తాము మల్లన్నసాగర్‌కు వ్యతిరేకం కాదని కాని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాలని అందోళనలు చేపట్టి కేసీఆర్, హరీశ్‌రావులు ఈ రోజు ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. -
యూటీ కాదు.. హైదరాబాద్ మాది
వినాయక్‌నగర్ (నిజామాబాద్), నూస్లైన్ : ‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నడు. అది ఆయన జాగీరు కాదు, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి’ అని ఎంఐఎం నాయకుడు ఖైసర్ హెచ్చరించారు. నగరంలోని ఖిల్లా చౌరస్తాలో గల ఈద్గా పక్కన గల ఆట స్థలంలో బుధవారం సలార్-ఎ-మిలత్ బ్యానర్ పై టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నీని బహుదుర్పూర ఎమ్మెల్యే మోజమ్‌ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ పేరుతో సహా సలార్-ఎ-మిలత్ బ్యానర్‌కు గుర్తింపు వచ్చేలా ఆడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ అల్తాఫ్ అజర్జ్వ్రి మాట్లాడుతూ..మైనార్టీల కోసం మన నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాడుతున్నారన్నారు. రాష్ట్రం లో ముస్లింల కోసం ఎంఐఎం పార్టీ ఎంత కష్టపడుతుందో దేశవ్యాప్త ముస్లింలు చూస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బ్యాటింగ్ చేయగా, ఎమ్మెల్యే బౌలింగ్ వేసి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫహిమ్ తదితరులు పాల్గొన్నారు.