సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణాలు చెల్లవని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక తేలిపోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి తనకు ఆహ్వానం లేదని, అయినా తనకు అంత ప్రోటోకాల్ లేదని అన్నారు. కేసీఆర్ భట్టికి ఇచ్చే ప్రాధాన్యత ఉత్తమ్‌కు ఇవ్వకపోవచ్చని అన్నారు.
సీఎల్పీ నేత ఎంపిక విషయంలో రాహుల్ నిర్ణయమే శిరోధార్యమని, సీఎల్పీ నేత ఎంపికలో లాబీయింగ్‌తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా పనిచేసిందని అన్నారు. సీఎల్పీ నేతగా నియమించి భట్టికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశం ఇచ్చిందని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా భట్టి తన పనితనాన్ని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లరని జగ్గారెడ్డి చెప్పారు. ఓడిపోయిన నేతలకు పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కారణం కానే కాదని, ఆయన సమర్ధవంతంగా పనిచేశారని, కానీ పరిస్థితులు అనుకూలించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఉత్తమ్ గొప్పవాడు అన్న సర్వే సత్యనారాయణ ఇప్పుడు ఉత్తమ్ పనికిరాడని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఉత్తమ్ మంచోడు.. ఇప్పుడు చెడ్డోడా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉత్తమ్ బలహీనుడు కాదని, బలవంతుడని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగించినా తప్పేమీ లేదని అన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతి పోటీచేయకపోతే తన భార్య నిర్మలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరతానని జగ్గారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment