సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరను రెండేళ్ల కాలపరిమితిలో అమలు చేసి చూపిస్తే సంగారెడ్డిలోనే ఆయనకు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధర విధానాన్ని అమలు చేస్తానని అధికారులకు కేసీఆర్ ఇచ్చిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ రైతుల తరఫున ప్రకటన చేయడంపై జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చినందు వల్లే కేసీఆర్‌కు ఏదైనా చేసే అవకాశం వచ్చిందన్నారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్‌గాంధీలకు కూడా మరో ఆలయం కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్ చెప్పిన రైతుకు గిట్టుబాటు ధర విషయం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలా జరిగితే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ విషయాన్ని తాను మానవతా దృక్పథంతో చెపుతున్నానని తెలిపారు.
దేవుడు దిగొచ్చినా సాధ్యం కాదు
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. అవినీతిని నిర్మూలించే శక్తి ఏ రాజకీయ వ్యవస్థకు లేదని, దేవుడే దిగొచ్చినా లంచగొండితనం నిర్మూలన సాధ్యం కాదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన విషయంలో ఆ శాఖ అధికారుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment