
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.ముఖేష్ గౌడ్ (60) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.