దానంపై భూ ఆక్రమణ కేసు
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసు లు నమోదయ్యాయి. తన స్థలాన్ని నాగేందర్ కాజేయడానికి యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్-2లోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని ఆనుకొని కొండపల్లి హైమావతి అనే మహిళకు 889 గజాల స్థలం ఉంది. వారం క్రితం ఈ స్థలంలో రూమ్ కట్టేందుకు ఆమె అల్లుడు జయేందర్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా దానం ప్రధాన అనుచరుడు సూరి, హేమా చౌదరి అనే వురో మహిళ, సోమాజిగూడ కార్పొరేటర్ ఎలిగల మహేష్ యాదవ్ వచ్చి ఈ స్థలం అన్నదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. దానం ఇంటికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని హెచ్చరించారు.
మరోమారు సూరి, ఆయన అనుచరులు స్థలం వద్దకు వచ్చి అన్న మాట్లాడతారంటూ ఫోన్ కలిపి ఇచ్చారు. ఫోన్‌లోనే జయేందర్‌రెడ్డిని దానం హెచ్చరించాడు. అసభ్యకరంగా దూషించారు. ఖాళీ చేసి వెళ్లకపోతే ఖతం చేస్తానంటూ బెదిరించారు. ఈ స్థలంలో నిర్మాణం ఎలా కడతావో చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితులు తనకు నాగేందర్ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో వెంటనే నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు దానంతోపాటు సోమాజిగూడ కార్పొరేటర్ మహేష్ యాదవ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఎఫ్‌ఐఆర్ నమోదైన మరుసటి రోజు కూడా నాగేందర్ మరోసారి జయేందర్‌రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం కోర్టులు, పోలీసులతో కాదని కేవలం తనతో సెటిల్మెంట్ చేసుకుంటేనే కొంతవరకు లాభపడతావంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ కొండపల్లి హైమావతి పీపుల్స్ వార్ అగ్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు స్వయానా మరదలు, ఏపీ డైరీ మాజీ చైర్మన్ చంద్రమౌళి రెడ్డి భార్య కావడం విశేషం.