మెదక్ కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియక కార్యకర్తలు, ముఖ్య నాయకులు అయోమయంలో పడ్డారు. ఆశావహులు ఎవరికి వారు టికెట్ తమదే అంటూ ప్రచారం సాగిస్తున్నారు. కానీ కార్యకర్తలు ఎవరి వెంట ప్రచారానికి వెళ్లాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. ఒకరు బీసీ కార్డుతో ప్రయత్నిస్తే.. మరొకరు పార్టీ సీనియర్ నాయకలతో, అలాగే మరో నాయకుడు మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీ నాయకుడితో లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్ విషయంలో మాజీ ఎంపీ విజయశాంతి కూడా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. దీంతో పార్టీ శ్రేణులు ఎవరిని టికెట్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో దిగేది నేనే.. నా లెక్కలు నాకున్నయ్. ఢిల్లీకి వెళ్లిన స్క్రీనింగ్ కమిటీ జాబితాలో కూడా నా పేరుంది. అధిష్టానం పెద్దల ఆశీస్సులు ఫుల్‌గా నాకే ఉన్నయ్... మనం పోటీలో ఉండటం ఖాయం.. అంటూ మెదక్ నియోకజవర్గంలోని కాంగ్రెస్ ఆశావహులు ఎవరికి వారే టికెట్‌పై ధీమాగా ఉన్నారు. టికెట్ కేటాయింపు అంశం ఢిల్లీకి చేరడంతో అక్కడా టికెట్ కోసం ఎవరికివారే ముమ్మర లాబీయింగ్ చేస్తున్నారు. తమకే టికెట్ ఖాయమని తమ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు సంకేతాలు ఇస్తున్నారు. ఆశావహుల తీరు కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. టికెట్ ఆశిస్తున్న ముఖ్యనేతలు బలంగా తమకే టికెట్ దక్కుతుందని ఘంటాపథంగా చెబుతుండటంతో తాము ఎవరి వైపు వెళ్లాలో తెలియక కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు.
ఇప్పుడు ఒక నాయకుడి పక్షం నిలబడితే అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వని పక్షంలో ఆ తర్వాత తమ భవిష్యత్తు ఏమిటన్న సంశయం వెంటాడుతోంది. దీంతో ఏమి చేయాలో పాలుపోక చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిన్నుకుండిపోతున్నారు. అధిష్టానం టికెట్ ప్రకటించాకే ప్రచారంలోకి దిగాలని కార్యకర్తలు ఎక్కువ మంది అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ప్రతాప్‌రెడ్డి, మ్యాడం బాలకృష్ణ తదితరులు ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.కాగా మాజీ ఎంపీ విజయశాంతి పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కార్యకర్తల్లో అయోమయం..
అధిష్టానం ఈ నెలాఖరులోగా టికెట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ ఇన్‌చార్జి కుంతియా ఢిల్లీ వెళ్లడంతో ఆశావహులంతా టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ముఖ్య నాయకులు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి ద్వారా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బట్టి జగపతి బీసీ కార్డు ఉపయోగించి టికెట్ కోరుతున్నారు.
అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు మహాకూటమిలో కీలక బాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి ఎంపీ నంది ఎలయ్య, ఏఐసీసీ నేత ఆజాద్ ద్వారా ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం వత్తిడి తీసుకువస్తున్నారు. మ్యాడం బాలకృష్ణ మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ సీఎం రోశయ్య ద్వారా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఎవరికివారే తమకు టికెట్ దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. దీంతో కార్యకర్తల్లో ఆమయోమయం నెలకొంది.
పట్టుసడలించిన రాములమ్మ?
మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె మద్దతు తెలిపిన వారికే దాదాపు టికెట్ దక్కవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. మొదట తానే స్వయంగా మెదక్ నుంచి పోటీ చేయాలని ఆమె భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రం అంతటా ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీకి ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
మాజీ ఎంపీ శశిధర్‌రెడ్డి మినహాయించి ఆశావహుల్లో గెలిచే అవకాశం ఉన్న వారికి ఎవరికి టికెట్ ఇచ్చిన తనకు అభ్యంతరం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో సర్వేలతోపాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతి తన వైఖరి మార్చుకుని శశిధర్‌రెడ్డి టికెట్ కేటాయించే విషయంలో అభ్యంతరం తెలుపుతున్న విజయశాంతి ప్రస్తుతం అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు సమ్మతమేనని, గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment