దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధాని మోదీ కాదు : వీహెచ్
హైదరాబాద్ : దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రావచ్చంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధాని నరేంద్రమోదీ కాదని, ఆర్‌ఎస్‌ఎస్ ఏం చెబితే అదే జరుగుతోందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం వీహెచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏడాది గడిచినా విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని ప్రధాని మోదీ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పైగా దేశాన్ని లూటీ చేసి హవాలా ద్వారా విదేశాల్లో డబ్బుదాచిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీని రక్షించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని ప్రమేయం లేకపోతే వెంటనే కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాబు పచ్చి అవకాశవాది అని వీహెచ్ మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూనే, గవర్నర్‌ను దూషిస్తున్నారని దుయ్యబట్టారు.