త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతా | Congress Nakrekal MLA likely to join TRS | Sakshi
Sakshi News home page

త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతా

Published Sun, Mar 10 2019 2:26 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

Congress Nakrekal MLA likely to join TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకోగా లింగయ్య కూడా అధికార పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో తన చేరికను ఖరారు చేస్తూ చిరుమర్తి లింగయ్య శనివారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోనే నల్లగొండ జిల్లాతోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నకిరేకల్‌ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని లింగయ్య లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా పార్టీ నాయకుల వైఖరి మారడం లేదని ఆయన విమర్శించారు.

అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తానని చిరుమర్తి లింగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. ‘ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు అచంచల విశ్వాసం ప్రకటించి అఖండ విజయాన్ని అందించారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి’అని లేఖలో చిరుమర్తి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద నాయకులమని చెప్పుకొనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు గతంలో పార్టీ లో, ప్రభుత్వంలో పెద్ద పదవులు పోషించినా 2014 వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. 

కేసీఆర్‌ నాయకత్వంలోనే నల్లగొండ అభివృద్ధి
2014 శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది జరుగుతోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశంసించారు. నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమైన మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు చెరువుల పునరుద్ధరణ జరిగిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలు బీడుపడిన నల్లగొండ జిల్లా భూములను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోందని చిరుమర్తి లేఖలో పేర్కొన్నారు.

దీంతో తన సొంత నియోజకవర్గం నకిరేకల్‌తోపాటు నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగునీరు అందుతుందన్నారు. నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయని, రూ. 24 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్‌ ప్లాంటు ద్వారా నల్లగొండ ఆర్థిక ముఖచిత్రం మారుతుందని చిరుమర్తి లింగయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్లాంటు ద్వారా స్థానికంగా 8 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 

ఓడినా మార్పులేదు
యాదాద్రి పవర్‌ ప్రాజెక్టుతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కేసులు వేయడం దురదృష్టకరమని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. ప్రగతి నిరోధకులుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ నేతల తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం అమలు చేసున్న అభివృద్ధి పనులకు సహకరించకుండా కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేనందునే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నకిరేకల్‌ నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తానన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement