సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్ అధిష్టానం, పెద్దల హడావుడి, ముందుగా చేసిన ప్రకటన మేరకు గురువారం తొలి జాబితా విడుదల అవుతుందని అందరూ భావించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో ఆరు చోట్ల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారు కాగా, మిగతా ఏడు స్థానాలకు ఒకటి, రెండు పేర్లు పంపారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ సమాచారం మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. బుధవారం, గురువారం రెండు రోజుల్లో ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ, టీపీసీసీ, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమై జాబితా ప్రకటన, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. మహాకూటమిలో భాగస్వాములైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల సీట్ల కేటాయింపులతోపాటు కాంగ్రెస్ పోటీ చేసే అన్ని సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను మళ్లీ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం 95 స్థానాలకు గాను మొదటి విడతగా 57 మంది జాబితా సిద్ధమైందని ప్రకటించారు.
అయితే.. మరోమారు ఈనెల 8న ఢిల్లీలో జరిగే కీలక భేటీ తర్వాతే మొత్తం జాబితాను విడుదల చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడనుందనే సమాచారంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హుటాహుటిన పయనమైన కాంగ్రెస్ ఆశవహులు జాబితా ప్రకటన 8, 9వ తేదీలకు వాయిదా పడడంతో తిరిగి హైదరాబాద్‌కు చేరారు. మొదటి విడతగా కొద్ది మందితో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనుకున్న అధిష్టానం తమ ఆలోచనను ఉపసంహరించుకొని ఈనెల 8, 9వ తేదీల్లో ఏదో ఒకేరోజు ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment