
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్‌లో ఉత్కంఠతకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఎవరికి వారే అభ్యర్థులుగా చెప్పుకోవడం తప్ప... ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చేదాకా ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇక్కడి నేతలది. ఇప్పటి వరకు కాంగ్రెస్, మిత్రపక్షాలకు సంబంధించి పోటీ చేసే స్థానాల సంఖ్యపైనే స్పష్టత రాలేదు. కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నాయకులు అప్పుడప్పుడు సమావేశమవుతున్నా... లెక్క తేలడం లేదు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో తెలిస్తే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మిత్రపక్షాల భేటీలో తేలని లెక్క
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులు శనివారం కూడా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలుస్తుందని భావించినప్పటికీ, అదేమీ జరగలేదు. కూటమిలోని పార్టీల తరఫున భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమైనట్లు నేతలు చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తులో బెల్లంపల్లి, మంచిర్యాల సీట్లలో ఏది పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం అన్ని సీట్లలో పోటీకి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయినట్టేనా..?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త నాయకులు, అధికారులు సైతం ఆయా నియోజకవర్గాల్లో సీటు కోసం దరఖాస్తులు సమర్పించుకున్నారు. అభ్యర్థుల స్క్రూటినీ ఎంత వరకు వచ్చిందో తెలియని స్థితి. పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో ఫ్లాష్ సర్వే జరుపనున్నట్లు గతంలోనే ప్రకటించారు. సర్వే స్థితిగతుల మీద కూడా స్పష్టత లేదు. డీసీసీ, పీసీసీ నుంచి వడబోత తరువాత గుర్తించి మూడు పేర్ల నుంచి స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ఫ్లాష్ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరపడంతో ప్రక్రియ ముగుస్తుంది. ఉమ్మడి జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు పోటీ లేదు. మిగతా అన్ని చోట్ల స్క్రీనింగ్ కమిటీ నిర్ణయమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందనడంలో సందేహం లేదు.
కాంగ్రెస్ టికెట్ల కోసం కొత్త నేతల హంగామా
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ సీట్ల కోసం పోటీ పెరిగింది. పార్టీలో ఇప్పటి వరకున్న నాయకులతోపాటు కొత్తగా టీఆర్‌ఎస్‌లో టికెట్టు రాని రమేష్ రాథోడ్ పార్టీలో చేరి ఖానాపూర్ సీటుపై దస్తీ వేశారు. చారులత రాథోడ్ అనే మహిళా నాయకురాలు సైతం ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు అధికారులుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న రాంకిషన్, సుమన్‌జాదవ్ కూడా టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. స్థానికులైన హరినాయక్, భరత్ చౌహాన్, తదితరులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తూ పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వా యి హరీష్‌రావు ఇటీవల పార్టీలో చేరారు.
తొలుత ఇండిపెండెంట్‌గా రంగంలో ఉంటానని ప్రకటించినప్పటికీ, తరువాత మహేశ్వర్‌రెడ్డి హామీతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో రేవంత్‌రెడ్డితోపాటే పార్టీలో చేరిన రావి శ్రీనివాస్ కూడా పోటీలో ఉండగా, సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ సైతం బీసీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీనివాస్‌యాదవ్ మినహా ఇద్దరూ పార్టీకి కొత్తవారే. చెన్నూరులో కూడా కొత్త నాయకత్వం పట్ల పార్టీ అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ గ్రూప్–1 అధికారిగా రాజీ నామా చేసి వచ్చిన బోర్లకుంట వెంకటేష్ నేత టికె ట్టు రేసులో ముందున్నారు. ఆయన సంస్థాగతంగా పార్టీ యంత్రాంగాన్ని తనకు చేరువ చేసుకునే పని ఇప్పటికే ప్రారంభించారు. కాగా టికెట్టు మీద నమ్మకంతోనే రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావు, దుర్గం అశోక్ కూడా పోటీ పడుతున్నారు. ఇక మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్, ముథోల్‌లలో పార్టీ సీనియర్ నాయకులే టికెట్టు రేసులో ఉన్నారు.